
MS Dhoni: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు. కేవలం ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, గతంలో దేశం కోసం ఆడిన మాజీ క్రికెటర్లకు కూడా బీసీసీఐ అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ‘రిటైర్డ్ ప్లేయర్స్ పెన్షన్ స్కీమ్’ ద్వారా మాజీ ఆటగాళ్లకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని అందజేస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్ ఎంఎస్ ధోని పెన్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఒక ఆటగాడు ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఎంఎస్ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. 25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు అత్యున్నత పెన్షన్ కేటగిరీ కిందకు వస్తారు. ఈ లెక్కన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ ప్రతి నెలా రూ. 70,000 పెన్షన్‌గా చెల్లిస్తోంది.
2022లో బీసీసీఐ తన పెన్షన్ పథకంలో కీలక మార్పులు చేసింది. అప్పటివరకు నెలకు రూ. 50,000 ఉన్న గరిష్ట పెన్షన్ మొత్తాన్ని రూ. 70,000కు పెంచింది.
రూ. 70,000: 25 కంటే ఎక్కువ టెస్టులు ఆడిన మాజీ క్రికెటర్లు (ధోనీ, సచిన్, గవాస్కర్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు).
రూ. 60,000: మరికొంతమంది మాజీ టెస్ట్ ప్లేయర్లు.
రూ. 30,000: ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లు.
ఎంఎస్ ధోనీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అయినప్పటికీ, బీసీసీఐ ఇచ్చే పెన్షన్ అనేది కేవలం ఆర్థిక అవసరం కోసం మాత్రమే కాకుండా, దేశం కోసం వారు చేసిన సేవలకు ఇచ్చే ఒక గౌరవంగా భావిస్తారు. కేవలం ధోనీ మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు కూడా ఈ పెన్షన్‌ను అందుకుంటున్నారు.
ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వినోద్ కాంబ్లీ వంటి మాజీ క్రికెటర్లకు బీసీసీఐ ఇచ్చే ఈ పెన్షన్ పెద్ద ఊరటనిస్తోంది. ధోనీ ఈ పెన్షన్ మొత్తాన్ని పలు సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..