Team India: బీసీసీఐపై ఆరోపణలు.. అరెస్ట్ భయంతో పరుగో పరుగు.. విరాట్ కోహ్లీ మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Feb 23, 2023 | 1:57 PM

వన్డేల్లో 6 సిక్సర్ల రికార్డు మొట్టమొదటిగా అతడి పేరు మీద రికార్డు అయింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి..

Team India: బీసీసీఐపై ఆరోపణలు.. అరెస్ట్ భయంతో పరుగో పరుగు.. విరాట్ కోహ్లీ మెచ్చిన ఆ ప్లేయర్ ఎవరంటే?
Virat Kohli Fav Cricketer
Follow us on

వన్డేల్లో 6 సిక్సర్ల రికార్డు మొట్టమొదటిగా అతడి పేరు మీద రికార్డు అయింది. టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి అతడు ఫేవరెట్ ప్లేయర్. అలాగే దక్షిణాఫ్రికాకు ఓపెనర్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. క్రమంగా కెరీర్ ఎండింగ్‌లో డొమెస్టిక్ టోర్నమెంట్లలో భాగమయ్యాడు. బీసీసీఐపై ఆరోపణలు చేశాడు.. కట్ చేస్తే.. అరెస్ట్ భయంతో భారత్‌కే రాలేదు. మరి అతడెవరో కాదు హెర్షెల్ గిబ్స్. ఈ రోజు గిబ్స్ పుట్టిన రోజు. అతడు 49వ ఏట అడుగుపెట్టాడు.

23 ఫిబ్రవరి 1974న జన్మించిన గిబ్స్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు అద్భుత ఇన్నింగ్స్‌లతో సంచలనం అయితే.. మరికొన్నిసార్లు మైదానం వెలుపల గొడవల కారణంగా హాట్ టాపిక్‌గా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్ గిబ్స్. ఇలా ఒకవైపు తనదైన శైలి దూకుడు ఆటతీరుతో దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాలు అందించిన గిబ్స్.. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో క్రికెట్ ఆడినందుకు పలు వివాదాలలో ఇరుక్కున్నాడు.

POKలో గిబ్స్ ఆడటంపై దుమారం..

గతేడాది పీఓకేలో నిర్వహించిన టోర్నీలో ఆడిన కారణంగా హర్షల్ గిబ్స్‌పై దుమారం రేగింది. అతడు లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడటంతో.. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్టు నుంచి గిబ్స్‌ను అర్ధాంతరంగా తొలగించారు. ఆ తర్వాత అతడి స్థానంలో షేన్ వాట్సన్ ఎంపికయ్యాడు. ఇక ఈ తొలగింపునకు గిబ్స్ బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. భారత క్రికెట్ బోర్డును ఆరోపిస్తూ, ‘రాజకీయాలను, క్రికెట్‌ను బీసీసీఐ కలపడం సరికాదని’ పేర్కొన్నాడు.

ఫిక్సింగ్‌ ఆరోపణలతో 6 నెలల నిషేధం..

గిబ్స్ క్రికెట్ కెరీర్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ అంశం ఓ మాయని మచ్చ అని చెప్పొచ్చు. ఈ ఉదంతానికి సంబంధించిన కేసులో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హన్సీ క్రోంజే, గిబ్స్ దోషులుగా తేలారు. అలాగే 2001లో వెస్టిండీస్ పర్యటనలో అతడు తన సహచరులతో కలిసి డ్రగ్స్ సేవించినందుకు కూడా గిబ్స్ జట్టు నుంచి బహిష్కరించబడ్డాడు. ఆ సమయంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని 5వ మ్యాచ్‌లో గిబ్స్ 20 పరుగుల కంటే తక్కువ స్కోర్ చేయడానికి బుకీల నుంచి ఆఫర్‌ను అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, విచారణలో భాగంగా ఈ విషయాన్ని కమిషన్ ముందు గిబ్స్ అస్సలు అంగీకరించలేదు. అయితేనేం అతడిపై 6 నెలల నిషేధం విధించింది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.

అరెస్టు భయంతో భారత్‌కు రాలేదు..

మ్యాచ్ ఫిక్సింగ్‌లో చిక్కుకున్న కారణంగా, గిబ్స్ భారత్‌ పర్యటనకు రాలేదు. ఇండియాకు వస్తే ఫిక్సింగ్ కేసులో తనను అరెస్ట్ చేస్తారేమోనని భయంతో గిబ్స్.. ఆ పర్యటనకు డుమ్మా కొట్టాడు. కానీ చివరిగా, 2006 సంవత్సరంలో, అతడు భారతదేశానికి వచ్చి ఫిక్సింగ్ కేసుకు సంబంధించి భారత పోలీసుల ప్రశ్నలకు జవాబిచ్చాడు.