
Watch : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రెస్ మీట్‌లో ఒక జర్నలిస్ట్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు ఆమె ఇచ్చిన అదిరిపోయే రిప్లై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సమాధానం చూసిన నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్.. గతంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రెస్ మీట్‌లో చేసిన హల్‌చల్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనుంది. ఈసారి సరికొత్తగా మొత్తం 12 జట్లు ఈ మెగా టోర్నీలో తలపడబోతున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌తో ఢీ
ఈ టోర్నీలో భారత జట్టు అత్యంత కఠినమైన గ్రూప్-ఎ లో ఉంది. ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌లతో భారత్ పోటీ పడాల్సి ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌లోనే జూన్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభానికి ముందు ఐసీసీ అధికారికంగా 12 జట్ల కెప్టెన్లతో ఒక సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది.
రిపోర్టర్‌తో హర్మన్‌ప్రీత్ ఫన్నీ చాట్
ఈ ఇంటరాక్షన్ సమయంలో ఒక రిపోర్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను టార్గెట్ చేస్తూ.. ‘ఇది మీకు చివరి వరల్డ్ కప్ కాబోతోందా?’ అని ప్రశ్నించాడు. దానికి హర్మన్‌ప్రీత్ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే ఎందుకు? అని అడిగింది. దానికి సదరు రిపోర్టర్ ‘నేను ఊరికే అడుగుతున్నాను’ అని కవర్ చేయబోయాడు. వెంటనే హర్మన్‌ప్రీత్ ‘నేను క్రికెట్ ఆపాలని మీరు అనుకుంటున్నారా?’ అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. దానికి రిపోర్టర్ ‘అలా ఏం లేదు’ అని అనడంతో.. ‘మరి ఇంకెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు?’ అంటూ నవ్వుతూనే క్లాస్ పీకింది.
OH HARMAN…LOVE YOUUUU…
Muh bandh karane ka tareeka accha hain 🤣🤣 pic.twitter.com/V7eF9Syj2o— Poulami Basu (@poulami2991) June 7, 2026
2016 నాటి ధోనీ ఇంటర్వ్యూ గుర్తోచ్చింది
ఈ సీన్ చూసిన వారంతా 2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఎంఎస్ ధోనీ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ శామ్ ఫెరిస్‌కు ఇచ్చిన కౌంటర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో ధోనీని రిటైర్మెంట్ గురించి అడగ్గా.. ధోనీ ఆ రిపోర్టర్‌ను తన పక్కన కూర్చోబెట్టుకుని సరదాగా ప్రశ్నలు అడిగి నవ్వించాడు. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అదే పీక్ ధోనీ స్టైల్‌లో రిపోర్టర్ నోరు మూయించడంతో ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత కెరీర్ రికార్డులు
2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఆమె 197 టీ20 మ్యాచ్‌లు ఆడి 4,075 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆమె కెప్టెన్సీలోనే భారత్ 2023 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. అలాగే 2020లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి