IPL 2026 : ముంబై ఓటములకు హార్దిక్ నిర్ణయాలే కారణమా? డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా సవ్యంగానే ఉందా?

IPL 2026 : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీయే కారణమని మాజీ స్టార్ సదగోపన్ రమేష్ విమర్శించారు. రోహిత్, సూర్యతో విభేదాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జస్ప్రీత్ బుమ్రాను పవర్‌ప్లేలోనే రెండు ఓవర్లు వాడటం పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు.

IPL 2026 : ముంబై ఓటములకు హార్దిక్ నిర్ణయాలే కారణమా? డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా సవ్యంగానే ఉందా?
Hardik Pandya

Updated on: Apr 15, 2026 | 10:41 AM

IPL 2026 : ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ లొల్లి మళ్లీ ముదిరింది. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే వరుసగా మూడు ఓటములతో ముంబై చతికిలపడటంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ నిర్ణయాలతో ఏకీభవించడం లేదని, మైదానంలోనే వారి మధ్య బేధాభిప్రాయాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యూహాల్లో విఫలమైన హార్దిక్ పాండ్యా?

మాజీ ఆటగాడు సదగోపన్ రమేష్ అభిప్రాయం ప్రకారం.. హార్దిక్ పాండ్యా ఆటగాడిగా గొప్పవాడే కానీ, కెప్టెన్‌గా మాత్రం చాలా సాధారణంగా ఉన్నాడట. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాను పవర్‌ప్లేలోనే రెండు ఓవర్లు వాడటం పెద్ద తప్పిదమని ఆయన పేర్కొన్నారు. బుమ్రా 6వ ఓవర్‌లో బౌలింగ్ చేసి వెళ్ళిపోతే, మళ్లీ 17వ ఓవర్ వరకు అతడికి బంతి ఇవ్వకపోవడం వల్ల.. ప్రధాన బౌలర్ దాదాపు 60 బంతుల పాటు మ్యాచ్‌కు దూరమయ్యాడని రమేష్ విమర్శించారు.

రోహిత్, సూర్యతో విభేదాలు?

మైదానంలో హార్దిక్ తీసుకునే కొన్ని నిర్ణయాలు రోహిత్ శర్మకు అస్సలు నచ్చడం లేదని, అది రోహిత్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోందని రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకానొక సందర్భంలో అనవసరమైన రివ్యూ తీసుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా దిగ్భ్రాంతికి గురయ్యాడని ఆయన గుర్తు చేశారు. వాంఖడే స్టేడియంలో ఇరువైపులా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం పెద్ద నేరం లాంటిదని, రజత్ పటీదార్ వంటి స్పిన్ మొనగాడికి మార్కండేను బౌలింగ్ ఇవ్వడం హార్దిక్ అయోమయ స్థితికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.

ముంబై భవితవ్యం ఏంటి?

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా లేదా టైటిల్ గెలవాలన్నా ఈ తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జట్టులో సీనియర్ల అనుభవాన్ని హార్దిక్ ఉపయోగించుకోలేకపోతే ముంబైకి ఈ సీజన్ చాలా కష్టంగా మారుతుందనిపిస్తోంది. అభిమానులు కూడా సోషల్ మీడియాలో రోహిత్ శర్మనే మళ్లీ కెప్టెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us