Asia Cup 2025 : టీమిండియాకు భారీ షాక్.. ఆసియా కప్‌కు ఆ టాప్ ప్లేయర్లు దూరం

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో ఎవరుంటారనేది ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది. ఒకవైపు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌పై ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది.

Asia Cup 2025 : టీమిండియాకు భారీ షాక్..  ఆసియా కప్‌కు ఆ టాప్ ప్లేయర్లు దూరం
Team India

Updated on: Aug 11, 2025 | 7:51 PM

Asia Cup 2025 : క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకపక్క టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఇప్పుడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ గురించి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. ఆసియా కప్ జట్టు ఎంపికకు ముందు హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొనాల్సి ఉంది. ఒకవేళ అతను ఫిట్‌గా లేకపోతే, టీమిండియాకు అది పెద్ద ఎదురుదెబ్బే.

భారత వైట్‌బాల్ క్రికెట్ జట్టుకు హార్దిక్ పాండ్యా ఒక స్ట్రాంగ్ ఆల్ రౌండర్. అతను 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే, అతని ఫిట్‌నెస్ ఇప్పుడు ఆసియా కప్ 2025కు ముందు ప్రశ్నార్థకంగా మారింది. జూలై మధ్య నుంచి ముంబైలో హార్దిక్ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, ఆసియా కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే తప్పనిసరిగా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వాలి.

హార్దిక్ పాండ్యా కంటే ముందు, మరో స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ జూలై 28-29 మధ్య ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొన్నాడు. అతను ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఆసియా కప్ జట్టులో అతని స్థానం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. అయ్యర్ కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచింది. అలాగే, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. 2023 డిసెంబర్ తర్వాత అయ్యర్ భారత్ తరపున ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో అతను అత్యధికంగా 243 పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హర్నియా సర్జరీ తర్వాత కోలుకుంటున్నారు. ఆసియా కప్‌లో ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అతను సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆసియా కప్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సూచనలు ఇచ్చారు. నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీలో మరో వారం పాటు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. అక్కడ ఫిజియో, మెడికల్ టీమ్ అతని ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..