U19 Womens T20 World Cup: ఫైనల్‌లోనూ త్రిష మెరుపులు.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భద్రాచలం అమ్మాయి

ఇప్పుడు మలేషియాలో భద్రాచలం పేరు మార్మోగిపోతోంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష ప్రతిష్ఠాత్మక అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టింది. తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో భారత్ ను విశ్వ విజేతగా నిలిపింది.

U19 Womens T20 World Cup: ఫైనల్‌లోనూ త్రిష మెరుపులు.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భద్రాచలం అమ్మాయి
Trisha Gongadi

Updated on: Feb 02, 2025 | 3:24 PM

ప్రతిష్ఠాత్మక అండర్ 19 మహిళల ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 02)న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 82 పరుగులకు ఆలౌట్ అయ్యారు. అనంతరం స్వల్ఫ లక్ష్యాన్ని టీమిండియా 11.2 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి అందుకుంది. తద్వారా అండర్ 19 మహిళల టీ20 క్రికెట్ విభాగంలో రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఇక టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫైనల్ లోనూ మెరుపులు మెరిపించింది. మొదట తన స్పిన్ బౌలింగ్ తో దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపెట్టింది. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్ల పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలోనూ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా బౌండరీలతో చెలరేగింది. 33 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకుంది.

 

ఇవి కూడా చదవండి

ఈ ప్రపంచకప్ టోర్నీఆసాంతం అద్భుతంగా రాణించింది త్రిష. మొత్తం ఏడు మ్యాచుల్లో 77 సగటుతో మొతకతం 309 పరుగులు సాధించింది. తద్వారా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో త్రిష కేవలం 59 బంతుల్లోనే 110 పరుగులు సాధించింది.

ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో..

ఇక బౌలింగ్ విభాగంలోనూ త్రిష అదరగొట్టింది. కీలక సమయాల్లో తన  స్పిన్ మ్యాజిక్ ను చూపిస్తూ బ్యాటర్లను పడగొట్టేసింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో త్రిష అద్భుతంగా బౌలింగ్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. కీలకమైన మూడు వికెట్ల పడగొట్టి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికి తన ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో భద్రాచలం పేరు మార్మోగిపోయేలా చేస్తోంది త్రిష.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ , సిరీస్ అవార్డులు కైవసం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..