
Shubman Gill : భారత క్రికెట్ జట్టు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. నిన్న మొన్నటి వరకు టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్, ఇప్పుడు జట్టులోనే చోటు కోల్పోయారు. టీ20 ప్రపంచకప్ 2026 జట్టు నుంచి అతడిని తప్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, గిల్ వరుసగా ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడటంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఫామ్‌లోకి రావాలంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ కంటే ముందుగా.. ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకోవాలని సరదాగా సలహా ఇచ్చారు.
టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికపై స్టార్ స్పోర్ట్స్‌లో విశ్లేషణ చేస్తూ గవాస్కర్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇటీవల అహ్మదాబాద్ నుంచి ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు గిల్‌తో తాను మాట్లాడానని గవాస్కర్ తెలిపారు. “గిల్ ఒక క్లాస్ ప్లేయర్. కానీ గత కొంతకాలంగా గాయాలు, పేలవ ఫామ్‌తో అతను ఇబ్బంది పడటం నాకు నచ్చలేదు. అందుకే అతడికి ఒక మాట చెప్పాను.. బాబు గిల్, నువ్వు ముందుగా ఇంటికి వెళ్లి మీ నానమ్మ లేదా అమ్మమ్మతో దిష్టి తీయించుకో అని సలహా ఇచ్చాను. మాకు ఇలాంటి విషయాలపై నమ్మకం ఎక్కువ” అని గవాస్కర్ తనదైన శైలిలో నవ్వుతూ చెప్పారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గిల్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా ఉంది. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి అతను చేసింది కేవలం 32 పరుగులు మాత్రమే. అంతేకాకుండా కాలి గాయం కారణంగా నాలుగో టీ20 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. గిల్ వంటి టాలెంట్ ఉన్న ఆటగాడు ఇలా వరుసగా విఫలమవ్వడం సెలెక్టర్లకు కూడా మింగుడుపడలేదు. అందుకే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు వరల్డ్ కప్ జట్టు నుంచి కూడా అతడిని పక్కన పెట్టారు.
గవాస్కర్ మాటల్లోని ఆంతర్యం ఏంటంటే.. ఎంతటి గొప్ప ఆటగాడికైనా అప్పుడప్పుడు గ్రహస్థితి లేదా కాలం కలిసిరాదని, అలాంటి సమయంలో చిన్నపాటి విరామం తీసుకుని మానసికంగా సిద్ధమవ్వాలని సూచించారు. గిల్ మళ్ళీ తన ఫామ్‌ను అందిపుచ్చుకుని జట్టులోకి రావాలని గవాస్కర్ ఆకాంక్షించారు. మరి దిగ్గజం ఇచ్చిన ఈ దిష్టి సలహా గిల్ పాటిస్తారో లేదో చూడాలి. ఏదేమైనా, గిల్ మళ్ళీ తన బ్యాట్‌తో పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..