Team India: ప్రమాదంలో గౌతమ్ గంభీర్ కెరీర్.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

Akash Chopra Comments on Gautam Gambhir Coaching: ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో గౌతమ్ గాంభీర్ కోచింగ్ సామర్థ్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు ఓటమి తర్వాత, గాంభీర్ నేతృత్వంలోని టీమిండియా పేలవ ప్రదర్శనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ మార్పుల అవకాశం ఉందని, రాబోయే మ్యాచ్‌ల ఫలితాలు గాంభీర్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెలక్టర్ల నిర్ణయాలు కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేస్తున్నాయని చోప్రా పేర్కొన్నారు.

Team India: ప్రమాదంలో గౌతమ్ గంభీర్ కెరీర్.. టీమిండియా మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Gautam Gambhir

Updated on: Jun 28, 2025 | 4:22 PM

Akash Chopra Comments on Gautam Gambhir Coaching: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ స్థానం ప్రమాదంలో ఉందని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైన నేపథ్యంలో, గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించారు.

గంభీర్ నాయకత్వంలో టీమిండియా పేలవ ప్రదర్శన..

ఆకాష్ చోప్రా తన వ్యాఖ్యలలో, గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని ఎత్తి చూపారు. “టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ ఆడిన చివరి తొమ్మిది టెస్టుల్లో కేవలం రెండింటిలోనే గెలిచింది. ఏకంగా ఏడు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది” అని చోప్రా పేర్కొన్నారు.

గంభీర్ కోచింగ్‌లో బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక టెస్టు గెలిచినప్పటికీ, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో మూడు, తాజాగా ఇంగ్లాండ్‌తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఈ పేలవమైన గణాంకాలు గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని చోప్రా అభిప్రాయపడ్డారు.

సెలక్టర్ల నిర్ణయంపై ఒత్తిడి..

“ఈ పర్యటనలో టీమిండియాకు అనుకూల ఫలితాలు రాకపోతే గౌతమ్ గంభీర్ తన పదవిని కోల్పోవచ్చు. ఎందుకంటే జట్టు యాజమాన్యం కోరిన ఆటగాళ్లనే సెలక్టర్లు ఎంపిక చేశారు. అడిగిన ప్లేయర్‌లను జట్టులోకి తీసుకున్న తర్వాత కూడా ఫలితాలు రాకపోతే ఇబ్బందులు తప్పవు” అని ఆకాష్ చోప్రా స్పష్టం చేశారు. అంటే, గంభీర్ కోరినట్టుగా జట్టును ఎంపిక చేసిన తర్వాత కూడా విజయాలు సాధించకపోతే, అది కోచ్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుందని ఆయన సూచించారు.

రాబోయే సిరీస్‌ల ప్రాముఖ్యత..

ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో టీమిండియా ప్రదర్శన గౌతమ్ గంభీర్ కోచింగ్ భవిష్యత్తును నిర్ణయిస్తుందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గంభీర్ కోచింగ్‌లో జట్టు పుంజుకుంటుందా లేదా అనేది రాబోయే మ్యాచ్‌లలో స్పష్టమవుతుంది. ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..