Gautam Gambhir : గౌతమ్ గంభీర్ మౌన ముద్ర..గిల్ ఎగ్జిట్ పై కోచ్ నో కామెంట్..ఎయిర్ పోర్ట్‎లో మీడియా పై శీతకన్ను

Gautam Gambhir : శనివారం మధ్యాహ్నం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జట్టులో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ మౌన ముద్ర..గిల్ ఎగ్జిట్ పై కోచ్ నో కామెంట్..ఎయిర్ పోర్ట్‎లో మీడియా పై శీతకన్ను
Gautam Gambhir

Updated on: Dec 21, 2025 | 9:51 AM

Gautam Gambhir : శనివారం మధ్యాహ్నం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ జట్టులో స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ పేరు లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. నిన్నటి వరకు టీ20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను ఏకంగా జట్టు నుంచే తప్పించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విషయంపై అభిప్రాయం కోరగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మౌనం పాటించడం గమనార్హం.

జట్టు ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే గంభీర్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుముట్టారు. ముఖ్యంగా గిల్ ఎంపిక కాకపోవడంపై గంభీర్ స్పందన ఏంటని పదే పదే ప్రశ్నించారు. కానీ, గంభీర్ ఎక్కడా ఆగకుండా, కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా నేరుగా తన కారు వైపు వెళ్లిపోయారు. విమానాశ్రయం నుంచి వెళ్లే వరకు ఆయన మీడియాను పూర్తిగా విస్మరించారు.

గిల్ జట్టు నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అతని పేలవమైన ఫామ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20ల్లో తిరిగి రీఎంట్రీ ఇచ్చాక 15 మ్యాచ్‌లాడిన గిల్, ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు. అతని స్ట్రైక్ రేట్ కూడా 137.26 వద్దే ఉంది. అభిషేక్ శర్మతో కలిసి గిల్ ఇచ్చే ఆరంభాల కంటే, సంజూ శామ్సన్-అభిషేక్ జంట మెరుగైన ఫలితాలు ఇస్తోందని సెలెక్టర్లు భావించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో గిల్ గాయం వల్ల దూరమవ్వగా, ఆ స్థానంలో వచ్చిన సంజూ 22 బంతుల్లో 37 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.

మరోవైపు గిల్ గైర్హాజరీలో అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం మరో కీలక పరిణామం. ఇప్పుడు ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మకు తోడుగా సంజూ శామ్సన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌గా భావించిన గిల్, ఇలా ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోవడం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి గంభీర్ మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో కాలమే సమాధానం చెప్పాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..