
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణ రాహిత్యం గురించి BCCI దృష్టికి తీసుకురావడంతో, క్రికెటర్ల కుటుంబాలు, భార్యల బసపై పలు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. BCCI ప్రకారం, విదేశీ పర్యటనలు 45 రోజుల కంటే ఎక్కువ ఉంటే, భారత క్రికెటర్ల కుటుంబాలకు గరిష్టంగా 14 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. తక్కువ కాలం పర్యటనల కోసం, ఈ పరిమితి కేవలం ఏడు రోజులకు మాత్రమే.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం తరువాత గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జనవరి 11న ముంబైలో జరిగిన సమీక్షా సమావేశంలో BCCI అధికారులతో చర్చించారు. గంభీర్ డ్రెస్సింగ్ రూమ్‌లో క్రమశిక్షణ లేకపోవడం వల్ల జట్టు ప్రదర్శన ప్రభావితమైందని పేర్కొన్నారు. ‘‘కుటుంబ బస సమయానికి పరిమితులు విధించడం అవసరం’’ అని గంభీర్ అభిప్రాయపడ్డారు.
ఆస్ట్రేలియాలో 54 రోజుల సుదీర్ఘ పర్యటనలో జట్టు సభ్యుల మధ్య సమన్వయం లోపించిందని గంభీర్ పేర్కొన్నారు. విభిన్న గుంపులుగా క్రికెటర్లు లంచ్ కు వెళ్ళడం, జట్టు మొత్తం కలిసి డిన్నర్‌లు చేయకపోవడం వంటి ఘటనలు వారి ఆత్మబలాన్ని దెబ్బతీశాయని ఆయన అభిప్రాయపడ్డారు. జూనియర్ ఆటగాళ్లతో సీనియర్ క్రికెటర్లు జట్టు వ్యవహారాల్లో సమన్వయం కంటే వ్యక్తిగత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు పేర్కొన్నారు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి కోచ్ గంభీర్ సూచనలను పరిగణలోకి తీసుకుని, కోవిడ్ మునుపటి నిబంధనలను తిరిగి ప్రవేశపెట్టింది. విదేశీ పర్యటనల్లో భార్యలు, కుటుంబాల ఉనికిని పరిమితి చేయడం ద్వారా ఆటగాళ్ల దృష్టి పూర్తిగా ఆటపైనే నిలబడేలా చేయాలన్నది ఈ నిర్ణయ లక్ష్యం.
గంభీర్‌తో పాటు, సమావేశానికి హాజరైన సీనియర్ ఆటగాళ్లలో ఒకరు కూడా మ్యాచ్ ఫీజు చెల్లింపుల విధానంపై కీలక సూచన చేశారు. ఆటగాళ్ల ప్రదర్శనకు అనుగుణంగా ఫీజును పంపిణీ చేయాలని, అనవసరంగా తొందరపడకుండా జట్టు ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
క్రమశిక్షణా చర్యలు జట్టులో మరింత సమన్వయం తీసుకురావడానికి మార్గం చూపుతాయని భావిస్తున్నప్పటికీ, కొందరు క్రికెటర్లు ఈ మార్పులకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌తో కోల్‌కతాలో జరగనున్న టీ20 మ్యాచ్ సందర్భంగా గౌతమ్ గంభీర్, BCCI అధికారులు మరొక సమావేశం జరపనున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి.
భారత క్రికెట్‌లో క్రమశిక్షణను పెంపొందించడమే ఈ కొత్త నిర్ణయాల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, అటు ఆటగాళ్లపై ఇటు వారి కుటుంబాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..