AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer : యువరాజ్ నుంచి మైఖేల్ క్లార్క్ వరకు..క్యాన్సర్‎ను జయించి తిరిగి వచ్చిన క్రికెటర్లు వీళ్లే

క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి చాలామంది క్రికెటర్ల జీవితాలను కూడా ప్రభావితం చేసింది. యువరాజ్ సింగ్ 2011 ప్రపంచ కప్‌లో దగ్గుతూ, మైదానంలో కూర్చోవడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్ వల్ల తనకు ఆరవ సర్జరీ జరిగిందని వెల్లడించాడు.

Cancer : యువరాజ్ నుంచి మైఖేల్ క్లార్క్ వరకు..క్యాన్సర్‎ను జయించి తిరిగి వచ్చిన క్రికెటర్లు వీళ్లే
Yuvraj Singh
Rakesh
|

Updated on: Aug 27, 2025 | 7:47 PM

Share

Cancer : క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి క్రికెటర్లను కూడా వదలలేదు. యువరాజ్ సింగ్ 2011 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో దగ్గుతూ మైదానంలో కూర్చుండిపోయిన దృశ్యం ఇంకా అందరికీ గుర్తుంది. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ తనకు స్కిన్ క్యాన్సర్ ఉందని, అందుకే ఆరో సారి సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. క్లార్క్ స్కిన్ క్యాన్సర్ నిజమైనదని, ప్రతి ఒక్కరూ తరచూ చెకప్‌లు చేయించుకోవాలని కోరాడు. క్లార్క్‌కు ముందు కూడా చాలా మంది క్రికెటర్లు క్యాన్సర్‌తో పోరాడారు. ఆ క్రికెటర్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. మైఖేల్ క్లార్క్

మైఖేల్ క్లార్క్‌కు 2006లో మొదటిసారి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. తన క్రికెట్ కెరీర్ కొనసాగిస్తూనే ఈ వ్యాధితో పోరాడాడు. 2019లో అతని నుదురు నుంచి మూడు నాన్-మెలనోమా కణాలను తొలగించారు. క్లార్క్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2015 వన్డే ప్రపంచ కప్ గెలిచింది.

2. యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్‌కు 2011లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, 2011 వరల్డ్ కప్‌కు ముందే అతనికి దాని లక్షణాలు కనిపించాయి. తీవ్ర అనారోగ్యంతో కూడా యువరాజ్ ఆ వరల్డ్ కప్‌లో 15 వికెట్లు తీయడంతో పాటు 362 పరుగులు చేశాడు. అతని ఊపిరితిత్తులలో కణితి (ట్యూమర్) ఉన్నట్లు తేలింది. అమెరికాలో చికిత్స తీసుకున్న తర్వాత, కొన్ని నెలల తర్వాత 2012లో మళ్లీ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు.

3. రిచీ బెనౌడ్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ , వ్యాఖ్యాత రిచీ బెనౌడ్ తన చివరి రోజుల్లో క్యాన్సర్‌తో బాధపడ్డారు. ఆయనకు నుదురు, తలపై స్కిన్ క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ గురించి ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, 2015 ఏప్రిల్ 10న ఆయన కన్నుమూశారు.

4. జియోఫ్రే బాయ్‌కాట్

జియోఫ్రే బాయ్‌కాట్‌కు 2003లో గొంతు క్యాన్సర్ వచ్చింది. తన వ్యాఖ్యానంతో పేరు తెచ్చుకున్న బాయ్‌కాట్, క్యాన్సర్ కారణంగా వ్యాఖ్యానాన్ని వదిలివేయవలసి వచ్చింది. రేడియోథెరపీలో 35 సెషన్స్ తీసుకున్న తర్వాత, ఆయన ఒక సంవత్సరంలోనే కోలుకుని తిరిగి వ్యాఖ్యానానికి వచ్చారు.

5. ఆండీ ఫ్లవర్

2010లో ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్‌కు కుడి చెంపపై స్కిన్ క్యాన్సర్ వచ్చింది. సర్జరీ తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్నారు. అప్పటి నుంచి ఆయన స్కిన్ క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు.

6. గ్రేమ్ పొలాక్

దక్షిణాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ గ్రేమ్ పొలాక్‌కు 2013లో పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు.

7. మార్టిన్ క్రో

న్యూజిలాండ్ గొప్ప బ్యాట్స్‌మెన్ మార్టిన్ క్రో 2012లో లింఫోమా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్యాన్సర్ రోగనిరోధక శక్తిపై దాడి చేస్తుంది. మొదట్లో చికిత్స బాగానే ఉన్నప్పటికీ, 2014లో క్యాన్సర్ తిరిగి వచ్చింది. 2016లో 53 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.

8. సామ్ బిల్లింగ్స్

ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ 2022లో తన ఛాతిపై వచ్చిన మెలనోమా క్యాన్సర్ నుంచి బయటపడటానికి 2 సర్జరీలు చేయించుకున్నట్లు తెలిపారు. బిల్లింగ్స్ కూడా స్కిన్ క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..