ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. కాగా, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. అయితే, ఈసారి చాలా మంది స్టార్ ప్లేయర్లు తమ చివరి ప్రపంచకప్ ఆడబోతున్నారు. వారిలో చాలా పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఓ ఆరుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 6 మంది ఆటగాళ్లలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. వారి పేర్లు తెలిస్తే అభిమానులు ఆశ్చర్యపోతారు. ఒకరు ఆస్ట్రేలియా, ఇంకొకరు ఇంగ్లండ్, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు ఉన్నారు. వీళ్లందరికీ ఇదే చివరి ప్రపంచకప్ కావడం దాదాపు ఖాయం.
భారత కెప్టెన్ రోహిత్ శర్మకు 36 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్ నాటికి అతనికి 40 ఏళ్లు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ప్రపంచకప్ వరకు ఆడడం అసాధ్యం. కాగా, టీ20 కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు అప్పగించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. అందుకే వరుసగా ఎన్నో సిరీస్‌లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ప్రపంచకప్ తర్వాత రోహిత్‌కి టీ20, వన్డేల నుంచి విశ్రాంతి ఇవ్వవచ్చు. లేదా రోహిత్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు.
భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత నెల సెప్టెంబర్ 17న 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచకప్‌నకు ఎంపికైన తర్వాత, ఇది తన చివరి ప్రపంచకప్ అని కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ టోర్నీ తర్వాత అతను టెస్టుల్లో ఆడటం చూడొచ్చు.
కింగ్‌గా పేరొందిన విరాట్ కోహ్లీ పేరు వింటే అభిమానులు కచ్చితంగా కొంత ఆశ్చర్యానికి లోనవుతారు. కానీ.. వచ్చే ప్రపంచకప్‌లో ఆడడం మాత్రం చాలా కష్టమే. వచ్చే నెల నవంబర్ 5న కోహ్లీకి 35 ఏళ్లు నిండుతాయి. కోహ్లీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ 4 ఏళ్లు వేచి చూసి, వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అంటే కష్టమనే అనుకోవాలి.
ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్‌పై వార్నర్ స్వయంగా సూచనప్రాయంగా తెలిపాడు. టోర్నీ తర్వాత తన క్రికెట్ కెరీర్ గురించి ఆలోచించవచ్చని ఇటీవల ప్రకటించాడు. 2015, 2019లో ప్రపంచకప్ ఆడిన వార్నర్ 2019 సీజన్‌లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అక్టోబర్ 27న వార్నర్ 37వ ఏట అడుగుపెట్టనున్నాడు.
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇప్పటికే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ, ఇంగ్లండ్ బోర్డు ఒప్పించడంతో రిటైర్‌మెంట్‌ను విరమించుకుని ప్రపంచకప్ ఆడుతున్నాడు. అయితే 32 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రపంచకప్ తర్వాత మళ్లీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకవచ్చు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు.
36 ఏళ్ల స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈసారి వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. అయితే, ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఇటీవలే సూచించాడు. ఈసారి షకీబ్ తన 5వ వన్డే ప్రపంచకప్ ఆడనున్నాడు. దీనికి ముందు అతను 2007, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లు ఆడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..