Gustav McKeon Century: అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్రాన్స్ జట్టు ఇంకా పసికూనే. ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తోంది. అయితే ఆ జట్టు ఆటగాడు గుస్తావ్ మెక్‌కీన్ (Gustav McKeon) అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు. 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అఫ్గనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ (Hazratullah Zazai) పేరిట ఉందేడి. ఇతను 20 ఏళ్ల 337 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 యూరప్ క్వాలిఫయర్ గ్రూప్ బి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కీన్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న అతను 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు,9 సిక్స్‌లు ఉన్నాయి.
కాగా ఈ మ్యాచ్ లో మెక్‌కీన్ సెంచరీతో మెరిసినా ఫ్రాన్స్ జట్టు మాత్రం ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మెక్‌కీన్ 109 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్విట్జర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ నజీర్ (67) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరి 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి బంతికి బౌండరీ బాది స్విట్జర్లాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. కాగా మెక్‌కీన్ ఈ టోర్నమెంట్లో చెలరేగుతున్నాడు. చెక్‌రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 54 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ఇప్పటివరకు 161 స్ట్రైక్ రేట్‌తో 185 పరుగులు సాధించాడు. సగటు 92.50గా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..