
IND Vs PAK : భారతదేశం, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లను పూర్తిగా నిలిపివేయాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ గట్టిగా డిమాండ్ చేశారు. ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు ఉండకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు. దీనికి ఆయన 2025 ఆసియా కప్‌ను ఉదాహరణగా చూపారు. ఆ టోర్నమెంట్‌లో రెండు దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో చాలా గొడవలు, వివాదాలు తలెత్తాయని ఆయన గుర్తు చేశారు.
ది టైమ్స్ పత్రిక కోసం రాసిన కాలమ్‌లో మైఖేల్ అథర్టన్, ఆసియా కప్‌లో జరిగిన గొడవను ఉదహరించారు. ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో చేతులు కలపడానికి నిరాకరించడం, అలాగే పాకిస్తాన్ ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ… విజేత ట్రోఫీని భారతీయులు తీసుకోకపోవడంతో, ఆ ట్రోఫీని తనతో పాటు తీసుకెళ్లిపోవడం వంటి సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ‘ఒకప్పుడు క్రీడ దౌత్యానికి సాధనం అయితే, ఇప్పుడు ఇది ఉద్రిక్తత, దుష్ప్రచారానికి ఒక మార్గంగా స్పష్టంగా మారింది’ అని మైఖేల్ అథర్టన్ అభిప్రాయపడ్డారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనందున, ఈ మ్యాచ్‌లకు భారీ ఆర్థిక ప్రాముఖ్యత లభించిందని మైఖేల్ అథర్టన్ అన్నారు. ఐసీసీ టోర్నమెంట్‌లలో ప్రసార హక్కులు ఇంత ఖరీదుగా ఉండటానికి ముఖ్య కారణం ఇదేనని చెప్పారు. 2023-27 సైకిల్‌కు ఐసీసీ హక్కులు దాదాపు మూడు బిలియన్ డాలర్లకు అమ్ముడయ్యాయి. ‘2013 నుంచి ప్రతి ఐసీసీ టోర్నీ గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్‌లు తలపడుతున్నాయి. ఈ షెడ్యూలింగ్ అనేది కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను తప్పనిసరి చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతోంది’ అని ఆయన ఆరోపించారు.
ఐసీసీ టోర్నమెంట్‌లలో కనీసం ఒక్కసారైనా ఈ రెండు జట్లు తలపడేలా చూసేలా చేసే ఏర్పాట్లను తొలగించే సమయం ఆసన్నమైందని అని అథర్టన్ గట్టిగా చెప్పారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ డ్రా, షెడ్యూల్ ప్రకారం… మూడు వారాల టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు ప్రతి ఆదివారం తలపడేలా రూపొందించడం జరిగింది. ‘ఏదైనా క్రీడా సంస్థ, కేవలం తన ఆర్థిక అవసరాల కోసం టోర్నమెంట్ మ్యాచ్‌లను నిర్వహించడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు ఈ వైరం ఇతర మార్గాల్లో ఉపయోగించబడుతున్నందున, దీనిని సమర్థించుకోవడం మరింత కష్టం’ అని ఆయన నొక్కి చెప్పారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..