రెండు దేశాల తరపున క్రికెట్ ఆడాడు.. పరిమిత ఓవర్లలో దుమ్ము లేపి, టెస్టుల్లో మాత్రం బోల్తా పడ్డాడు.. అతనెవరంటే?
England Cricket Team: వన్డే, టీ20ల్లో రాణించినట్లు టెస్టుల్లో మాత్రం రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ తరపున అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. ఆ జట్టుకు చిరకాల కోరికను నెరవేర్చిన తొలి కెప్టెన్‌గా పేరుగాంచాడు.
Eoin Mogan: ఇంగ్లండ్‌ని క్రికెట్ పితామహుడుగా పిలుస్తుంటారు. కానీ, ఈ దేశం మొదటి వన్డే ప్రపంచ కప్ గెలవడానికి దాదాపు 44 సంవత్సరాలు పట్టింది. 2019 లో తన మొదటి వన్డే ప్రపంచ కప్ టైటిల్ అందుకున్నాడు. కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఇంగ్లండ్ టీంకు ప్రపంచ కప్ అందించిన విజేతగా నిలిచాడు. ఈ రోజు మోర్గాన్ పుట్టినరోజు. 1986 సెప్టెంబర్ 10 న డబ్లిన్‌లో జన్మించిన మోర్గాన్.. రెండు దేశాల కోసం ఆడిన ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. మోర్గాన్ ఇంగ్లండ్ టీం కంటే ముందు ఐర్లాండ్ దేశం తరపున ఆడాడు. మోర్గాన్ ఐర్లాండ్ తరపున ఆడుతున్నప్పుడు స్కాట్లాండ్‌తో తన వన్డే అరంగేట్రం చేశాడు. 2006 లో ఈ మ్యాచ్ ఆడాడు. 2008 లో మిడిల్‌సెక్స్ తరపున ఆడుతున్నప్పుడు.. మోర్గాన్ ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టు ఆహ్వానం పలికింది. అనంతరం మోర్గాన్ ఇంగ్లండ్ టీంకు కెప్టెన్‌గా వ్యవహరించి రికార్డు సృష్టించాడు.
మోర్గాన్ అరంగేట్రం చేసిన జట్టుకు నాయకత్వం వహించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. తరువాత అదే జట్టుకు వ్యతిరేకంగా మరొక జట్టు కోసం ఆడాడు. మోర్గాన్ 2011 లో డబ్లిన్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతకుముందు కెప్లర్ వెసెల్స్ ఇలా రెండు దేశాల తరపున ఆడాడు.
ఇంగ్లండ్ టీంను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సంయుక్తంగా నిర్వహించిన 2015 ప్రపంచ కప్‌లో మోర్గాన్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ, ఈ ప్రపంచ కప్‌లో జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ప్రపంచ కప్‌కు ముందు అలెస్టర్ కుక్ నుంచి కెప్టెన్సీని తీసుకున్నాడు. ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. కానీ, ఆ తర్వాత మోర్గాన్ ఇంగ్లండ్ జట్టును బలంగా నిర్మించేందుకు నడుం బిగించాడు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు మోర్గాన్ జట్టును ముందుండి నడిపించాడు. ప్రపంచ కప్ లక్ష్యంగా ముందుకు సాగాడు. ఫలితంగా 2019 స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ మొదటిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు మోర్గాన్ ప్రాణం అయితే.. టెస్టు జట్టులో మాత్రం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. బంగ్లాదేశ్‌తో లార్డ్స్ మైదానంలో తన తొలి టెస్టును ఆడాడు. తన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లండ్ తరపున మొత్తం 16 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 30.43 సగటుతో 700 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతని పేరుపై రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మోర్గాన్ 2012 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు ఆడాడు. మోర్గాన్ వన్డేలు, టీ 20 ల్లో రాణించినట్లు టెస్టుల్లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. వన్డేల్లో ఇప్పటివరకు 246 మ్యాచ్‌లు ఆడాడు. 39.69 సగటుతో 7701 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 14 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు సాధించాడు. టీ 20 లో అతని ప్రదర్శన కూడా బాగానే ఉంది. పొట్టి ఫార్మాట్‌లో 107 మ్యాచ్‌లు ఆడాడు. 2360 పరుగులు చేశాడు. అయితే టీ 20 ల్లో మాత్రం సెంచరీ నమోదు చేయలేకపోయాడు. 14 అర్ధ సెంచరీలు అతని పేరుపై ఉన్నాయి.