
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అతని కూల్ కెప్టెన్సీ. ఎప్పుడూ కామ్ అండ్ కూల్‌గా ఉంటూ వికెట్ల వెనుక నుంచి మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తాడని అంతా అంటూ ఉంటారు. అతని మొత్తం కెరీర్‌లో ధోని చాలా తక్కువ సార్లు మాత్రమే తన సహనం కోల్పోయాడు. అలాంటి సందర్భాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని, ధోని తనను కోపంతో తిట్టాడంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఛాంపియన్స్ లీగ్ టీ20 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుందని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో తాను బౌలింగ్ చేసి, కేకేఆర్ డేంజరస్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్‌ను అవుట్ చేసినా కూడా ధోని తనను తిట్టడం ఆపలేదని అన్నాడు. అందుకు ఓ కారణం ఉంది.
అదేంటంటే.. ఆ ఓవర్ వేసేందుకు నిజానికి ధోని ఈశ్వర్ యాదవ్ అనే బౌలర్‌ను పిలిచాడు. కానీ, పొరపాటున తనను పిలుస్తున్నాడంటూ మోహిత్ శర్మ బౌలింగ్ వేసేందుకు వెళ్లిపోయి.. రన్నప్ వద్దకు చేరుకొని.. బౌలింగ్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ధోని మాత్రం తాను నిన్ని పిలువలేదని, ఈశ్వర్ యాదవ్‌ను బౌలింగ్ వేసేందుకు పిలిచానని చెప్పాడు. కానీ, అప్పటికే మోహిత్ శర్మ రన్నప్ తీసుకునేందుకు రెడీగా ఉండటంతో అంపైర్ అతనే బౌలింగ్ చేయాలని చెప్పడంతో ధోనికి మోహిత్‌పై కోపం వచ్చింది. నిన్ను ఎవరు పిలిచారు, ఎందుకు బౌలింగ్ వేయడానికి వచ్చావ్ అంటూ అతన్ని తిట్టాడంటా. అయితే ఆ ఓవర్ తొలి బంతికే మోహిత్ శర్మ.. కేకేఆర్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ వికెట్ తీసినా కూడా ధోని, మోహిత్‌ను తిట్టడం ఆపలేదంటూ మోహిత్ సరదాగా నవ్వుతూ ఈ విషయం వెల్లడించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి