
Delhi Capitals : ఐపీఎల్ అంటేనే ఆటగాళ్లపై కురిపించే కాసుల వర్షం కురిపించే ఆట. ఒక్కోసారి ఫ్రాంచైజీలు నమ్మకంతో భారీ ధర పెట్టి ఆటగాళ్లను కొంటే, వారు మాత్రం పేలవ ప్రదర్శనతో టీమ్ మేనేజ్‌మెంట్‌కు చుక్కలు చూపిస్తుంటారు. ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ తన భారీ ధరతో పోలిస్తే చేస్తున్న పరుగులు చూస్తుంటే ఢిల్లీకి గట్టిగానే బురిడీ కొట్టినట్లు కనిపిస్తోంది. లెక్కలు వేసి చూస్తే, అక్షర్ పటేల్ కొట్టిన ఒక్కో పరుగు విలువ అక్షరాలా 50 లక్షల రూపాయలు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఈ సీజన్ కోసం ఆ జట్టు ఏకంగా రూ.16.50 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. కెప్టెన్సీతో పాటు ఆల్‌రౌండర్ ప్రదర్శన ఇస్తాడని నమ్మితే, అక్షర్ మాత్రం బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన అక్షర్, 7 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కొట్టింది కేవలం 33 పరుగులు మాత్రమే. దీనిని అతడి జీతంతో పోలిస్తే, సగటున ఒక్కో పరుగుకు ఢిల్లీ టీమ్ రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి. ఇతర జట్లలోని స్టార్ ఆటగాళ్ల వైఫల్యాల గురించి చర్చిస్తున్న వారు, అక్షర్ పటేల్ లాంటి భారీ ధర ఉన్న ప్లేయర్ వైఫల్యాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అక్షర్ పటేల్ చేతులెత్తేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్, కేవలం 6 బంతులు ఆడి 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్‌లో అక్షర్ అత్యధిక స్కోరు కేవలం 26 నాటౌట్ మాత్రమే. బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా ఆడుతుండటం ఢిల్లీ ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతోంది. అయితే బౌలింగ్‌లో మాత్రం అక్షర్ కొంత మెరుగ్గానే కనిపిస్తున్నాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ రూ.16 కోట్లు పెట్టింది కేవలం 9 వికెట్ల కోసం కాదనేది వాస్తవం.
అక్షర్ పటేల్ ఓవరాల్ ఐపీఎల్ కెరీర్ చూస్తే అతను మంచి ఆటగాడే. ఇప్పటివరకు 172 మ్యాచ్‌లు ఆడి 1949 పరుగులు చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 136 వికెట్లు తీశాడు. కానీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ కీలక సీజన్‌లోనే బ్యాటింగ్ ఫామ్ తప్పడం ఢిల్లీకి శాపంగా మారింది. కీలక సమయంలో భారీ షాట్లు ఆడటంలో గానీ, ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో గానీ అక్షర్ పూర్తిగా తడబడుతున్నాడు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 4 గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది (చెన్నై మ్యాచ్‌తో కలిపి). ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరాలంటే తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంటుంది. అలా గెలిస్తే 16 పాయింట్లతో టెక్నికల్‌గా రేసులో ఉండొచ్చు. కానీ కెప్టెన్ స్వయంగా ఇలా అట్టర్ ప్లాప్ ప్రదర్శన ఇస్తుంటే, జట్టులోని మిగిలిన ఆటగాళ్లను ఎలా నడిపిస్తాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..