Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం
Viral: రవితేజ నటించిన ‘ఇరుముడి’పై క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. అయ్యప్ప మాల ధరించిన రవితేజ గెటప్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ ఫ్యాన్ ఎడిట్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

Viral: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా తెచ్చిన హైపు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అయ్యప్ప మాల ధరించినట్లు ఉన్న ఫ్యాన్ ఎడిట్ ఫొటోను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రీపోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఉన్న డేవిడ్ వార్నర్‌కు ఇక్కడి సినిమాలు, పాటలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తాజాగా ఆరెంజ్ ఆర్మీ ఫేవరెట్ అనే ఫ్యాన్ పేజీ సృష్టించిన ఒక వినూత్న ఫొటో వార్నర్ దృష్టిని ఆకర్షించింది. రవితేజ ఇరుముడి చిత్రంలో కనిపించిన అయ్యప్ప భక్తుడి గెటప్‌లో వార్నర్‌ను ఎడిట్ చేసి ఈ పోస్టర్‌ను రూపొందించారు. భక్తిశ్రద్ధలతో ఉన్న ఈ డిజిటల్ ఆర్ట్ నచ్చడంతో వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీనిని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అరుదైన ఘనత
బాక్సాఫీస్ వద్ద ఇరుముడి ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. తొలి రోజు నుంచి యునానిమస్ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం 105 ఏళ్ల టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని థియేటర్లలో సెకండ్ షోలు పూర్తిగా హౌస్‌ఫుల్ కావడం విశేషం. ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. థియేటర్లకు వెళ్లడం తగ్గించిన సామాన్య జనం కూడా ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు.
3 రోజుల్లో రూ.72 కోట్లకు పైగా వసూళ్లు
ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మూడంటే మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 72 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. గ్రాండ్ ఓపెనింగ్స్‌తో తొలి వీకెండ్‌లోనే రూ.80 కోట్ల మార్కు వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత పదేళ్లలో విడుదలైన బడా సినిమాల రికార్డులను తిరగరాస్తూ, కేవలం ఒకట్రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఏకైక చిత్రంగా నిలిచింది. రవితేజ కెరీర్‌లోనే ఇది గ్రాండ్ కంబ్యాక్‌గా నిలిచిపోనుంది.
View this post on Instagram
కట్టుకునే కథనంతో శివ నిర్వాణ మ్యాజిక్
దర్శకుడు శివ నిర్వాణ ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో రవితేజను అద్భుతంగా ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు గ్రామంలో త్రినాథ్ రామ (రవితేజ) అనే వ్యక్తి తన భార్య కావేరి, ముద్దుల కూతురు మణికంఠతో నివసిస్తుంటాడు. కార్తీక మాసంలో నిష్టగా అయ్యప్ప మాల ధరించే త్రినాథ్ జీవితంలోకి ఒక సమస్య వస్తుంది. ఊరిలోని పాఠశాలలో జరిగిన ఒక విషాద సంఘటన, దాని పరిణామాలు అతడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయనేది చిత్ర ఇతివృత్తం. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథకు దైవికమైన అంశాలను జోడించి దర్శకుడు సరికొత్త అనుభూతిని అందించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
