CSK : అతడి కోసం రూల్స్ బ్రేక్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. అశ్విన్ వ్యాఖ్యలతో రాజుకున్న నిప్పు

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ఐపీఎల్‌లో గతంలో రెండేళ్లపాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరోసారి ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు కారణం టీమ్ ఇండియా ఆఫ్-స్పిన్నర్, సీఎస్కే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.

CSK : అతడి కోసం రూల్స్ బ్రేక్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. అశ్విన్ వ్యాఖ్యలతో రాజుకున్న నిప్పు
Csk

Updated on: Aug 16, 2025 | 7:51 PM

CSK : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ఐపీఎల్‌లో గతంలో రెండేళ్లపాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మరోసారి నియమాలు ఉల్లంఘించిన ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలకు కారణం సీఎస్కే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలే. తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్, సౌతాఫ్రికా యంగ్ బ్యాట్స్‌మెన్ డేవాల్డ్ బ్రేవస్‌ను కొనుగోలు చేయడానికి సీఎస్కే నిబంధనలకు మించి ఎక్స్ ట్రా డబ్బులు ఇచ్చిందని ఆరోపించాడు. అశ్విన్ వ్యాఖ్యల తర్వాత మొదలైన ఈ వివాదంపై, సీఎస్కే యాజమాన్యం అధికారికంగా స్పందిస్తూ ఆరోపణలను ఖండించింది.

సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై చెన్నై సూపర్ కింగ్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ వివాదానికి ముగింపు పలకాలని చూసింది. ఐపీఎల్ 2025-27 సీజన్ నిబంధనలకు అనుగుణంగానే బ్రేవస్‌ను సెలక్ట్ చేసుకున్నామని సీఎస్కే స్పష్టం చేసింది. గాయపడిన లేదా అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను తీసుకురావడానికి అనుమతించే ఐపీఎల్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ నిబంధన కింద ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎస్కే తన ప్రకటనలో వివరించింది.

సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన ఐపీఎల్ 2025 ప్లేయర్ ఆక్షన్స్‌లో గుర్‌జప్‌నీత్ సింగ్ అనే ఆటగాడిని సీఎస్కే రూ.2.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను గాయపడటంతో అతని స్థానంలో బ్రేవస్‌ను అదే రూ.2.2 కోట్లకు బేస్ ప్రైస్‌తో జట్టులోకి తీసుకున్నామని, ఈ ప్రక్రియ మొత్తం ఐపీఎల్ నియమాలకు పూర్తిగా అనుగుణంగా ఉందని సీఎస్కే తెలిపింది.

రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ విషయంపై ఒక భిన్నమైన కథనాన్ని వెల్లడించాడు. “బ్రేవస్ చెన్నై జట్టులోకి వచ్చాక అద్భుతంగా ఆడాడు. అయితే, అతన్ని జట్టులోకి తీసుకోవడానికి చాలా ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి. కానీ, సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‎గా తీసుకుంటే అతన్ని బేస్ ప్రైస్‌కే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి ఆటగాళ్లు అంగీకరించరు. అందుకే ఏజెంట్‌లతో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఆటగాళ్లు నాకు కొంచెం ఎక్స్ ట్రా డబ్బుల ఇస్తే, నేను ఆడతాను అని చెబుతారు” అని అశ్విన్ అన్నాడు.

“అదే విధంగా, ఏజెంట్‌లతో మాట్లాడిన తర్వాతే సీఎస్కే అదనపు డబ్బులు ఇచ్చి బ్రేవస్‌ను జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్‌లో ఇలాంటివి జరగడం సహజం. ఎందుకంటే తర్వాతి సీజన్‌కు ముందు నన్ను జట్టు రిలీజ్ చేస్తే, వేలంలో నాకు ఎక్కువ డబ్బు వస్తుందని ఆటగాళ్లు భావిస్తారు. అందుకే వారు అధిక డబ్బులు డిమాండ్ చేస్తారు. అదే ప్రకారం బ్రేవస్‌కు కూడా బేస్ ధర కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి సీఎస్కే జట్టులోకి తీసుకుంది” అని అశ్విన్ తన వ్యాఖ్యల్లో వివరించాడు. అశ్విన్ వ్యాఖ్యలకు, సీఎస్కే వివరణకు మధ్య ఉన్న ఈ తేడా ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..