AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Match Fixing Scandal : క్రికెట్లో పెద్ద స్కామ్.. అవినీతి ఊబిలో చిక్కుకుని బ్యాన్ అయిన 20 మంది టాప్ క్రికెటర్లు

Match Fixing Scandal : క్రికెట్ చరిత్రలో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి బ్యాన్ అయిన 20 మంది టాప్ క్రికెటర్ల వివరాలు. ఈ జాబితాలో నలుగురు భారతీయులు, ఎనిమిది మంది పాకిస్తానీలు ఉన్నారు. కొందరికి కొన్నాళ్ల బ్యాన్ తర్వాత ఊరట లభించింది.

Match Fixing Scandal : క్రికెట్లో పెద్ద స్కామ్.. అవినీతి ఊబిలో చిక్కుకుని బ్యాన్ అయిన 20 మంది టాప్ క్రికెటర్లు
Match Fixing Scandal
Rakesh
|

Updated on: Jun 21, 2026 | 10:23 AM

Share

Match Fixing Scandal : క్రికెట్‌ను అందరూ జెంటిల్‎మెన్ గేమ్‎గా భావిస్తారు. కానీ ఈ ఆట వెనుక ఉన్న కోట్ల రూపాయల బెట్టింగ్ సామ్రాజ్యం చాలా మంది స్టార్ ప్లేయర్ల కెరీర్‌లను నాశనం చేసింది. బుకీల మాయలో పడి దేశాన్ని, నమ్మిన ఆటను మోసం చేసిన 20 మంది టాప్ క్రికెటర్ల బ్లాక్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లు ఎలాంటి తప్పులు చేశారు, వారిపై ఐసీసీ, స్థానిక క్రికెట్ బోర్డులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నాయో చూద్దాం.

1. మహ్మద్ అజారుద్దీన్ (భారత్) – జీవితకాల బ్యాన్

భారత క్రికెట్ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన స్టైలిష్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరు ఈ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉండటం ఒక పెద్ద విషాదం. 2000 సంవత్సరంలో సిబిఐ జరిపిన విచారణలో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ ఆయనపై లైఫ్ బ్యాన్ విధించింది. ఆ తర్వాత 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ బ్యాన్‌ను చెల్లదని ప్రకటించినప్పటికీ.. ఆయన కెరీర్‌పై పడ్డ ఆ నల్లటి మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది.

2. హాన్సీ క్రోన్యే (సౌతాఫ్రికా) – జీవితకాల బ్యాన్

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పతనం ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికా కెప్టెన్ హాన్సీ క్రోన్యేదే అని చెప్పాలి. ఎంతో గౌరవప్రదమైన లీడర్‌గా పేరు తెచ్చుకున్న క్రోన్యే.. 2000 సంవత్సరంలో బుకీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మ్యాచ్ ఫలితాలను మార్చడానికి ఒప్పుకున్నట్లు స్వయంగా అంగీకరించాడు. దీంతో ఆయనపై జీవితకాలం నిషేధం పడింది. ఆ తర్వాత 2002 లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన అనుమానాస్పదంగా మరణించారు.

3. సలీమ్ మాలిక్ (పాకిస్తాన్) – జీవితకాల బ్యాన్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ ఆధునిక క్రికెట్ చరిత్రలోనే అవినీతి కారణంగా జీవితకాల నిషేధానికి గురైన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఖయ్యూమ్ కమిషన్ జరిపిన సుదీర్ఘ విచారణలో సలీమ్ మాలిక్ మ్యాచ్‌లను మేనిపులేట్ చేశాడని, అంతేకాకుండా ఇతర దేశాల ఆటగాళ్లను కూడా లంచాలతో లోంగదీసుకోవడానికి ప్రయత్నించాడని ఆధారాలతో సహా నిరూపితం కావడంతో 2000 లో ఆయనపై లైఫ్ బ్యాన్ పడింది.

4. డానిష్ కనేరియా (పాకిస్తాన్) – జీవితకాల బ్యాన్

పాకిస్తాన్ అద్భుతమైన లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా ఎసెక్స్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో తన టీమ్ మేట్స్‌ను కూడా స్పాట్ ఫిక్సింగ్ ఊబిలోకి లాగడానికి ప్రయత్నించాడు. ఈ నేరానికి గాను 2012 లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. మొదట్లో ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కనేరియా.. చివరకు 2018 లో తాను బుకీలతో చేతులు కలిపిన మాట నిజమేనని పబ్లిక్‌గా ఒప్పుకున్నాడు.

5. అతా-ఉర్-రెహ్మాన్ (పాకిస్తాన్) – జీవితకాల బ్యాన్ (తర్వాత రద్దు)

ఈ పాకిస్తాన్ పేస్ బౌలర్‌పై 2000 సంవత్సరంలో కయ్యూమ్ కమిషన్ విచారణలో బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై, కోర్టులో అబద్ధాలు చెప్పినందుకు లైఫ్ బ్యాన్ విధించారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన అప్పీళ్లను పరిశీలించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2006లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీనివల్ల ఆయన మళ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడే అవకాశం దక్కింది.

6. శ్రీశాంత్ (భారత్) – జీవితకాల బ్యాన్ (7 ఏళ్లకు తగ్గింపు)

భారత స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ 2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ దొరికిపోయి తీవ్ర సంచలనం సృష్టించాడు. ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంతో బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. దీనిపై శ్రీశాంత్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి సుదీర్ఘ న్యాయపోరాటం చేశాడు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీసీఐ అంబుడ్స్‌మన్ ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించారు. ఆ నిషేధం 2020లో ముగిసింది.

7. లౌ విన్సెంట్ (న్యూజిలాండ్) – జీవితకాల బ్యాన్

న్యూజిలాండ్ మాజీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లౌ విన్సెంట్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్, ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ లలో వరుసగా మ్యాచ్ ఫిక్సింగ్ సిండికేట్లతో కలిసి పనిచేశాడు. 2014 లో ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తన తప్పులను ఒప్పుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆయనకు ఏకంగా 11 జీవితకాల నిషేధాలను ఒకేసారి విధించి షాక్ ఇచ్చింది.

8. సల్మాన్ బట్ (పాకిస్తాన్) – 10 సంవత్సరాల బ్యాన్

2010 లో జరిగిన లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సల్మాన్ బట్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌కు ప్లాన్ చేశాడు. తన జట్టులోని యంగ్ బౌలర్లను బలవంతం చేసి బుకీలు చెప్పిన టైమ్‌కు నో బాల్స్ వేయించాడు. ఐసీసీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 10 ఏళ్ల బ్యాన్ విధించగా.. బ్రిటన్ కోర్టు ఆయనకు జైలు శిక్ష కూడా విధించింది.

9. లోన్వాబో త్సోత్సోబే (సౌతాఫ్రికా) – 8 సంవత్సరాల బ్యాన్

సౌతాఫ్రికాకు చెందిన ఈ ఇంటర్నేషనల్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ 2015లో జరిగిన రామ్ స్లామ్ డొమెస్టిక్ టీ20 టోర్నమెంట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్లాన్ లో భాగస్వామి అయ్యాడు. బోర్డు అంతర్గతంగా జరిపిన లోతైన విచారణలో త్సోత్సోబే దోషిగా తేలడంతో 2017 లో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఆయనపై 8 ఏళ్ల పాటు నిషేధం విధించింది.

10. మహ్మద్ అష్రాఫుల్ (బంగ్లాదేశ్) – 8 సంవత్సరాల బ్యాన్

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మరియు ఒకప్పటి స్టార్ బ్యాట్స్‌మన్ మహ్మద్ అష్రాఫుల్ 2013 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అవినీతి నిరోధక ట్రిబ్యునల్ మొదట ఆయనకు 8 ఏళ్ల శిక్ష విధించగా.. ఆ తర్వాత అప్పీల్ చేసుకోవడంతో దాన్ని 5 ఏళ్ల యాక్టివ్ బ్యాన్, రెండేళ్ల సస్పెండెడ్ బ్యాన్‌గా తగ్గించారు.

11. మహ్మద్ ఆసిఫ్ (పాకిస్తాన్) – 7 సంవత్సరాల బ్యాన్

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన స్వింగ్ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న మహ్మద్ ఆసిఫ్.. 2010 లార్డ్స్ స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌లో సల్మాన్ బట్ చేతిలో పావుగా మారాడు. డబ్బుల కోసం ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం నో బాల్ వేసి ఐసీసీకి దొరికిపోయాడు. దీనికి గాను ఆయనపై 7 ఏళ్ల నిషేధం పడటంతో పాటు యూకే (UK) జైలులో కొన్ని రోజులు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.

12. అజయ్ జడేజా (భారత్) – 5 సంవత్సరాల బ్యాన్ (తర్వాత రద్దు)

భారత మిడిల్ ఆర్డర్ డాషింగ్ బ్యాట్స్‌మన్ అజయ్ జడేజాపై 2000 సంవత్సరంలో బుకీలతో సంబంధాలు పెట్టుకున్నాడనే ఆరోపణలపై బీసీసీఐ 5 సంవత్సరాల నిషేధం విధించింది. అయితే జడేజా దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. 2003లో కోర్టు ఆ బ్యాన్‌ను పూర్తిగా కొట్టేసి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన మళ్లీ లోకల్ మ్యాచ్‌లు ఆడాడు.

13. మనోజ్ ప్రభాకర్ (భారత్) – 5 సంవత్సరాల బ్యాన్

భారత ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్ నిజానికి తన సహచర ఆటగాళ్లే తనకు లంచం ఆఫర్ చేశారంటూ ఒక పెద్ద బాంబ్ పేల్చాడు. కానీ బీసీసీఐ నియమించిన మాధవన్ కమిటీ విచారణ రివర్స్ అయింది. ప్రభాకర్ చెప్పినవన్నీ అబద్ధాలని, పైగా ఆయనకే బుకీలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆయనపై 5 ఏళ్ల నిషేధం విధించారు.

14. మహ్మద్ అమీర్ (పాకిస్తాన్) – 5 సంవత్సరాల బ్యాన్

2010 లార్డ్స్ టెస్టులో నో బాల్స్ వేసిన ముగ్గురిలో మహ్మద్ అమీర్ కూడా ఒకడు. అప్పట్లో చిన్న వయస్కుడైన అమీర్.. కెప్టెన్ మాట వినాల్సి వచ్చిందని, తన తప్పును వెంటనే ఒప్పుకుని విచారణకు సహకరించాడు. దీనివల్ల ఐసీసీ అతనికి కనీస శిక్షగా 5 ఏళ్ల బ్యాన్ ఇచ్చింది. శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అమీర్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

15. షర్జీల్ ఖాన్ (పాకిస్తాన్) – 5 సంవత్సరాల బ్యాన్

పాకిస్తాన్ దూకుడు ఓపెనర్ షర్జీల్ ఖాన్ 2017లో దుబాయ్ వేదికగా జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో స్పాట్ ఫిక్సింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) దీనిపై విచారణ జరిపి 5 ఏళ్ల బ్యాన్ విధించింది. అయితే అందులో సగం కాలం సస్పెండ్ చేయడంతో.. రెండున్నర ఏళ్ల తర్వాత అతను మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టగలిగాడు.

16. ఉమర్ అక్మల్ (పాకిస్తాన్) – 3 సంవత్సరాల బ్యాన్ (12 నెలలకు తగ్గింపు)

పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ 2020 పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ముందు బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని బోర్డు యాంటీ కరప్షన్ యూనిట్‌కు చెప్పకుండా దాచాడు. ఈ నిర్లక్ష్యానికి పీసీబీ 3 ఏళ్ల బ్యాన్ వేయగా.. కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) దాన్ని 12 నెలలకు తగ్గించి, భారీ ఫైన్ వేసి వదిలేసింది.

17. మార్లన్ శామ్యూల్స్ (వెస్టిండీస్) – 2 సంవత్సరాల బ్యాన్

వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మార్లన్ శామ్యూల్స్ కూడా ఈ బురదలో ఉన్నాడు. 2008లో భారత్ పర్యటనలో ఉన్నప్పుడు టీమ్ యొక్క అంతర్గత సీక్రెట్ సమాచారాన్ని ఒక బుకీకి చేరవేసినట్లు తేలడంతో ఐసీసీ ఆయనపై 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది. శిక్ష తర్వాత ఆయన మళ్లీ జట్టులోకి వచ్చాడు.

18. అల్విరో పీటర్సన్ (సౌతాఫ్రికా) – 2 సంవత్సరాల బ్యాన్

సౌతాఫ్రికా ఓపెనర్ అల్విరో పీటర్సన్ నేరుగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయకపోయినప్పటికీ.. రామ్ స్లామ్ టీ20 టోర్నీలో బుకీలు తనను ఫిక్సింగ్ కోసం సంప్రదించిన విషయాన్ని అధికారులకు రిపోర్ట్ చేయలేదు. ఈ విషయాన్ని దాచినందుకు సౌతాఫ్రికా బోర్డు 2016 లో ఆయనపై రెండు సంవత్సరాల నిషేధం విధించింది.

19. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) – 1 సంవత్సరం బ్యాన్

ప్రపంచంలోనే నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బంగ్లాదేశ్ దిగ్గజం షకీబ్ అల్ హసన్ 2019 లో ఐసీసీ చేతిలో బుక్కయ్యాడు. 2018లో ఒక అంతర్జాతీయ బుకీ తనను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం సంప్రదించిన విషయాన్ని ఐసీసీ యాంటీ కరప్షన్ టీమ్‌కు చెప్పకుండా దాచాడు. దాంతో ఐసీసీ అతనికి రెండేళ్ల బ్యాన్ (ఒక ఏడాది సస్పెండెడ్ బ్యాన్) విధించింది.

20. హెర్షెల్ గిబ్స్ (సౌతాఫ్రికా) – 6 నెలల బ్యాన్

సౌతాఫ్రికా విధ్వంసకర ఓపెనర్ హెర్షెల్ గిబ్స్ 2000 సంవత్సరంలో భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 20 కంటే తక్కువ పరుగులు చేయడానికి కెప్టెన్ హాన్సీ క్రోన్యే ఆఫర్ చేసిన భారీ డబ్బును తీసుకోవడానికి మొదట ఒప్పుకున్నాడు. కానీ గ్రౌండ్‌లోకి వెళ్లాక మనసు మార్చుకుని ఆ డీల్ పక్కనబెట్టి నార్మల్‌గా ఆడాడు. అయితే మొదట ఒప్పుకున్న నేరానికి గాను అతనికి 6 నెలల చిన్న బ్యాన్ పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us