Cheteshwar Pujara: ‘ఆ చాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడమే నా కల’.. 100వ టెస్ట్ ఆడే ముందు ‘నయా వాల్’ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా తరఫున వెటరన్ బ్యాట్స్‌మ్యాన్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలు రాయిని అందుకోనున్నాడు. అదేమిటంటే.. భారత్ తరఫున 100..

Cheteshwar Pujara: ‘ఆ చాంపియన్‌షిప్ ఫైనల్ గెలవడమే నా కల’.. 100వ టెస్ట్ ఆడే ముందు ‘నయా వాల్’ కీలక వ్యాఖ్యలు..
Cheteshwar Pujara On Icc World Test Championship
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 16, 2023 | 4:53 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా రేపు(ఫిబ్రవరి 17) ఢిల్లీ వేదికగా రెండో టెస్టు ప్రారంభం  కానుంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఢిల్లీలో కూడా అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా తరఫున వెటరన్ బ్యాట్స్‌మ్యాన్ చతేశ్వర్ పుజారా అరుదైన మైలు రాయిని అందుకోనున్నాడు. అదేమిటంటే.. భారత్ తరఫున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు. రేపు జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌లో పుజారా ఈ ఘనతను అందుకోనున్నాడు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పుజారా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

తాను దేశం తరఫున 100 టెస్టులు ఆడతానని ఎన్నడూ అనుకోలేదని చెప్పాడు పుజారా. తన డ్రీమ్ గురించి రిపోర్టర్లు అడగ్గా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియా గెలవాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ‘‘టీమిండియా తరఫున 100 టెస్టులు ఆడటమంటే.. నాకు, నా కుటుంబానికి ఎంతో గొప్ప విషయం. ఇందులో మా నాన్న చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రేపు మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వస్తారు. ఎంతో మద్దతుగా నిలిచిన కుటుంబానికి నేను రుణపడి ఉంటాను. నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది’’ అని పుజారా వివరించాడు. ఇక భారత్ తరఫున ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడిన పుజారా.. 44.15 సగటుతో 7,021 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.

కాగా, బోర్డర్ – గవాస్కర్ టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిమ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది టీమిండియా. అదే విజయ పరంపరను కొనసాగించాలనే పట్టుదలతో.. రేపటి నుంచి జరిగే రెండో టెస్టు కోసం ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది.  మరోవైపు టీమిండియా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడేందుకు రెండు అడుగుల దూరంలోనే ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో టీమిండియా మరో రెండు టెస్టులు గెలిస్తే.. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. డబ్ల్యూటీసీ చరిత్రలో వరుసగా రెండు సార్లు ఫైనల్ ఆడిన జట్టుగా కూడా భారత్ నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..