దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ శుక్రవారం ప్రారంభమైంది. ఇండోర్‌లోని ఎమరాల్డ్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఎలైట్ గ్రూప్ డి మ్యాచ్ నాగాలాండ్, సౌరాష్ట్ర మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో జయదేవ్ ఉనద్కత్ సారథ్యంలోని సౌరాష్ట్ర 97 పరుగుల భారీ తేడాతో నాగాలాండ్‌ను ఓడించింది. టీమిండియా టెస్ట్ క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 35 బంతుల్లో 62 పరుగులు చేసిన పూజారా ఇన్నింగ్స్ 177.14 స్ట్రైక్ రేట్‌తో సాగడం విశేషం. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అదే సమయంలో సమర్థ్ వ్యాస్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. సమర్థ్ స్ట్రైక్ రేట్ 190.19. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 124 పరుగులు జోడించడం విశేషం. ఇద్దరూ కలిసి నాగాలాండ్‌పై 9 సిక్స్‌లు, 16 ఫోర్లు కొట్టారు. అంటే బౌండరీల ద్వారానే 118 పరుగులు సాధించారు. కాగా ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సమర్థ్, పుజారా ఇద్దరికీ మొదటి అర్ధ సెంచరీ కావడం విశేషం.
కాగా పుజారా, సమర్థ్‌ల ఈ ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్ర 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసి నాగాలాండ్ ముందు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాగాలాండ్ తరఫున ఆకాష్ సింగ్, ఇమ్లివాటి లెమ్తుర్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నాగాల్యాండ్ ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయింది. కేవలం 39 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌లో కూర్చుంది. చివరకు నాగాలాండ్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ చేతన్ బిష్త్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోరు. మొత్తం మీద 97 రన్స్‌తో ఘన విజయం సాధించిన సౌరాష్ట్ర దేశవాళీ క్రికెట్ టోర్నీలో శుభారంభం చేసింది.
కాగా IPL 2022 మెగా వేలంలో ఛెతేశ్వర్ పుజారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత , రాబోయే సీజన్‌లో అతని పేరు చర్చలోకి రావచ్చని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Cheteshwar Pujara played rapidly in Syed Mushtaq Ali Trophy match against Nagaland!#BCCI #SyedMushtaqAliT20 #CheteshwarPujara #Cricket pic.twitter.com/f0ktBKa6wV
— ScoresNow (@scoresnow_in) October 14, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..