
Prashant Veer Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు, సీజన్ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిపై భారీగా పెట్టుబడి పెట్టిన ఫ్రాంచైజీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్‌ను రూ.14.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అతనికి గాయం కావడంతో, 2026 ఐపీఎల్‌ల్లో ఆడడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అతని కుడి భుజానికి గాయమైంది.
ఉత్తరప్రదేశ్ వర్సెస్ జార్ఖండ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా ప్రశాంత్ వీర్ కు ఈ గాయం తగిలింది. మ్యాచ్ 30వ ఓవర్ లో, మిడ్-ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శిఖర్ మోహన్ ఆడిన పవర్ ఫుల్ షాట్ ను ఆపే క్రమంలో తన కుడి వైపుకు డైవ్ చేశాడు. బంతిని ఆపగలిగినప్పటికీ, అతను పడిపోయాడు. ఈక్రమంలో కుడి భుజం నేలను బలంగా తాకింది. అతను చాలా సేపు నొప్పితో నేలపైనే ఉన్నాడు. ఫిజియో వెంటనే నొప్పికి స్ప్రే చేసినా లాభం లేకపోయింది. ఆ తరువాత అతన్ని మైదానం నుంచి తప్పించి స్కాన్ కోసం ఆసుపత్రికి పంపారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, ప్రశాంత్ వీర్ గ్రేడ్ 2 టియర్‌తో బాధపడుతున్నట్లు అనుమానిస్తున్నారు. దీని వలన అతను కనీసం మూడు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు. IPL 2026 మార్చి చివరిలో ప్రారంభం కానుండటంతో, కాలక్రమేణా అతని ఫిట్‌నెస్‌పై ఒత్తిడి పెరుగుతుంది. IPL ప్రారంభానికి రెండు నెలల కన్నా తక్కువ సమయం మిగిలి ఉండటంతో, అతని కోలుకోవడం ఆలస్యం అయితే, CSK ఇతర ఎంపికలను అన్వేషించాల్సి రావొచ్చు.
ఐపీఎల్ 2026 మినీ వేలం సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఉత్తరప్రదేశ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ పై అపారమైన విశ్వాసం చూపించింది. రూ.14.20 కోట్లకు బిడ్ వేయడంతో IPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు. అభిమానులు మాత్రం రవీంద్ర జడేజా స్థానంలోకి తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, సీజన్ ప్రారంభానికి ముందు ఈ గాయం చెన్నై పై తీవ్రమైన ప్రభావాలను చూపే ఛాన్స్ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..