
ఐపీఎల్‌లో 2025 సీజన్‌లో మొదటి నుంచి ఫామ్‌లో లేని చెన్నైసూపర్ కింగ్స్ జట్టు సీజన్ చివరి మ్యాచ్‌లో అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 3 ఓవర్లో ప్రసిద్ క్రిష్ణ వేసిన బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించిన ఆయుష్ మాత్రే సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి 17 బంతుల్లో (34 పరుగులు) చేసి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఉర్విల్ పటేల్ దూకుడుగా ఆడుతూ డెవాన్ కాన్వేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇక 9 ఓవర్‌లో సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి 19 బంతుల్లో 37 పరుగులు సాధించి వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే 8 బంతుల్లో 17 పరుగులు సాధించి షారుఖ్ ఖాన్ బౌలింగ్‌లో గెరాల్డ్ కోయిట్జీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే ప్రారంభం నుంచే నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు డివైన్ కాన్వే. అయితే నిలకడగా ఆడుతున్న డెవాన్ కాన్వేను 13 ఓవర్‌లో రషీద్ ఖాల్ ఔట్ చేశాడు. దీంతో 35 బంతుల్లో 52 పరుగులు చేసి కాన్వే వెనుదిరిగాడు. అప్పటికే చెన్నై స్కోరు 13.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టాని 156 పరుగులకు చేరుకుంది.
ఇక ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ సిక్స్‌లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. జడేజాతో కలిసి ముందుకు సాగుతూ గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 23 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేసి స్కోరును పైకి తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ చివర్‌లో ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా 18 బంతుల్లో 21 పరుగులు చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీంతో గుజరాత్ ముందు 231 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విషయానికొస్తే ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, షారుఖ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..