Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ICC CEO షాకింగ్ డెసిషన్!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు ICC CEO జియోఫ్ అల్లార్డిస్ అనూహ్యంగా రాజీనామా చేశారు. పాకిస్థాన్‌లో టోర్నమెంట్ ఏర్పాట్లు గందరగోళంగా మారడం, భారత జట్టు భద్రతా కారణాల వల్ల దుబాయ్‌లో ఆడాలని కోరుకోవడం ప్రధాన వివాదాలుగా మారాయి. 2024 T20 ప్రపంచకప్ నిర్వహణలో వచ్చిన అవకతవకలు కూడా అల్లార్డిస్ రాజీనామా వెనుక మరో కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు ICC కొత్త CEO ఎవరు అనే ఆసక్తి క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ICC CEO షాకింగ్ డెసిషన్!
Icc Ceo

Updated on: Jan 29, 2025 | 9:46 AM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు కేవలం కొన్ని వారాల ముందు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జియోఫ్ అల్లార్డిస్ తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్థాన్‌లో టోర్నమెంట్ ఏర్పాట్లలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, అతని రాజీనామా క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. ICC అధికారికంగా రాజీనామాకు ఖచ్చితమైన కారణాన్ని వెల్లడించకపోయినా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) నిర్వహణ లోపాలు, టోర్నమెంట్‌కు సంబంధించి స్పష్టత లేకపోవడం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లోని వేదికలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ముఖ్యంగా, కరాచీ, రావల్పిండిలోని మైదానాలు ఇప్పటికీ నిర్మాణంలోనే ఉండటం, అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా లేవన్న విమర్శలు వచ్చాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడాలని నిర్ణయించుకోవడం, పాక్‌ క్రికెట్ నిర్వహణపై మరింత ఒత్తిడి తెచ్చింది.

అల్లార్డిస్ రాజీనామా వెనుక మరొక ముఖ్యమైన కారణం, 2024లో యూఎస్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ నిర్వహణలో వచ్చిన అవకతవకలు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి ఖర్చులు భారీగా పెరగడం, పలు సంస్థలు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేయడం అతని విధానంపై అనేక ప్రశ్నలను రేకెత్తించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కూడా అదే విధమైన సమస్యలు తలెత్తుతాయని భావిస్తూ, అల్లార్డిస్ ముందస్తుగా వైదొలగినట్లు సమాచారం.

అల్లార్డిస్ రాజీనామాతో ICCలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా మను సాహ్నీ CEO పదవి నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే. అతని రాజీనామా తర్వాత, అల్లార్డిస్ తాత్కాలిక CEOగా బాధ్యతలు చేపట్టి, 2021లో పూర్తి స్థాయి CEOగా నియమితుడయ్యాడు. అయితే, ఇప్పుడు అతని రాజీనామాతో, ICC కొత్త CEO కోసం అన్వేషణ ప్రారంభించింది.

ICC చైర్మన్ జే షా మాట్లాడుతూ, “అల్లార్డిస్ క్రికెట్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు. అతని సేవలకు మనమంతా కృతజ్ఞులం. భవిష్యత్తులో అతనికి మంచి జరుగాలని కోరుకుంటున్నాం” అని పేర్కొన్నారు.

2017 తర్వాత మొదటిసారి నిర్వహించబడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ, ఇప్పటికీ అనేక అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. పాకిస్థాన్ సమయానికి సిద్ధమవుతుందా? భద్రతా ఏర్పాట్లు పూర్తి అవుతాయా? అన్న ప్రశ్నలకు సమాధానాలే లేవు. ఈ పరిస్థితుల్లో, ICC కొత్త CEO పరిణామాలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..