
CLT20 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. చాన్నాళ్ల క్రితం ఆగిపోయిన ఛాంపియన్స్ లీగ్ టీ20 టోర్నమెంట్.. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ పేరుతో 2026 నుంచి తిరిగి ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలోని టాప్ టీ20 లీగ్‌లలో ఛాంపియన్‌లుగా నిలిచిన జట్లను ఒకే చోట చేర్చి, అద్భుతమైన లీగ్ పోరును ప్రేక్షకులకు అందించడమే ఈ కొత్త టోర్నమెంట్ ముఖ్య లక్ష్యం. ఈ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్(PSL), బిగ్ బాష్ లీగ్(BBL), SA20, ది హండ్రెడ్ వంటి ప్రముఖ టీ20 లీగ్‌లలో విజేతలుగా నిలిచిన జట్లు పాల్గొంటాయి. అంటే, ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు, పీఎస్‌ఎల్ విజేత జట్టు… ఇలా అన్ని ప్రధాన లీగ్‌ల ఛాంపియన్లు ఒకే వేదికపై తలపడతారు. ఇది క్రికెట్ ఫ్యాన్స్‌కు రెట్టింపు మజాను అందిస్తుందనడంలో సందేహం లేదు.
ఈ కొత్త ఛాంపియన్‌షిప్ ఆలోచనకు అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. ఇప్పటివరకు దేశీయంగా ఉన్న టాలెంటును గ్లోబల్ స్టేజి మీద ప్రదర్శించేందుకు ఇదో మంచి వేదిక అవుతుంది. ఈ విషయం మీద ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఐసీసీ ఛైర్మెన్ జైషా దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ తరపున ది బ్లాస్ట్ టోర్నమెంట్ ఛాంపియన్ బదులు, ది హండ్రెడ్ టోర్నమెంట్ విజేతను పంపాలని ఈసీబీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ సమయంలో టీ20 బ్లాస్ట్ టైటిల్ విన్నర్ జట్టునే పంపేవారు. అయితే ఇప్పుడు ఆ జట్లను కాకుండా హండ్రెడ్ లీగ్ టైటిల్ విన్నర్ ను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు మొదటిసారిగా ఛాంపియన్స్ గా అవతరించిన విషయం తెలిసిందే.
మొదట 2009లో ప్రారంభమైన చాంపియన్స్ లీగ్ కంటిన్యూగా 2014 వరకు నడిచింది. అయితే 2015లో టీవీ రేటింగ్స్ తక్కువగా ఉండటం, స్పాన్సర్ షిప్ స్ట్రగుల్స్ కారణంగా ఈ లీగ్ ను క్యాన్సిల్ చేశారు. ఇక ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు టైటిళ్లతో అత్యంత సక్సెస్ ఫుల్ జట్లుగా కూడా నిలిచాయి.
రాబోయే వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ ఫార్మాట్, అంతకుముందు జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20ని పోలి ఉండే అవకాశం ఉంది. వివిధ దేశాల నుండి టాప్ దేశీయ టీ20 జట్లను ఒకచోట చేర్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చే వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ప్రపంచంలోని బెస్ట్ లీగ్‌ల ఛాంపియన్ జట్లు ఒకరితో ఒకరు తలపడటం వల్ల పోటీ మరింత హోరాహోరీగా ఉంటుందని అంచనా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..