
T20 World Cup 2026 : 2026 టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 2024లో వెస్టిండీస్ గడ్డపై జయకేతనం ఎగురవేసిన భారత్, ఇప్పుడు తమ స్వదేశీ గడ్డపై ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది. అయితే, చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. టీమిండియా తన టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి మూడు ప్రధానమైన రికార్డుల శాపాలు అడ్డుగా నిలుస్తున్నాయి. వాటి గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
1. ఆతిథ్య దేశానికి అందని ద్రాక్ష
క్రికెట్‌లో సాధారణంగా సొంత గడ్డపై ఆడే జట్టుకు ప్రేక్షకుల మద్దతు, పిచ్‌లపై అవగాహన ఉండటం వల్ల గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇది రివర్స్ అవుతోంది. ఇప్పటివరకు జరిగిన 9 ఎడిషన్లలో ఏ ఒక్కసారి కూడా టోర్నీని నిర్వహించిన దేశం కప్పు గెలవలేదు. 2016లో భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు సెమీఫైనల్‌లోనే వెనుదిరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లు కూడా హోస్ట్ చేసినప్పుడు టైటిల్ సాధించలేకపోయాయి. 2026లో భారత్, శ్రీలంక కలిసి ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి కాబట్టి, ఈ హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడం భారత జట్టుకు మొదటి సవాల్.
2. వరుస విజయాల గండం
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు విజేతగా నిలవలేదు. భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు రెండేసి సార్లు ఛాంపియన్‌లుగా నిలిచినప్పటికీ, అవి ఒక టోర్నీకి, మరో టోర్నీకి మధ్య గ్యాప్ ఉంది. 2024లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు 2026లో మళ్లీ విజేతగా నిలిస్తే, వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన తొలి జట్టుగా టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. అయితే, గత తొమ్మిది టోర్నీల చరిత్ర చూస్తే ఏ జట్టుకూ ఇది సాధ్యపడలేదు.
3. టైటిల్ డిఫెండింగ్ కష్టం
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి, ఆ కిరీటాన్ని కాపాడుకోవడం అనేది టీ20 ఫార్మాట్‌లో అత్యంత కష్టమైన పనిగా మారింది. ప్రతి టోర్నీలోనూ కొత్త విజేత ఆవిర్భవించడమే టీ20 వరల్డ్ కప్ స్పెషాలిటీ. 2007లో భారత్ గెలిస్తే, 2009లో పాకిస్థాన్, 2010లో ఇంగ్లాండ్ ఇలా ప్రతిసారీ టైటిల్ చేతులు మారుతూనే ఉంది తప్ప, పాత ఛాంపియన్ మాత్రం దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. గత ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగడం వల్ల జట్టుపై ఉండే ఒత్తిడిని అధిగమించి భారత్ మళ్లీ కప్పు కొడుతుందా అనేది వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..