IND Vs AUS: భారత్‌తో రెండో టెస్ట్.. ఆసీస్‌లో గుబులు.. వార్నర్ ఔట్.! జట్టులో 4 కీలక మార్పులు..
ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే జట్టు ప్రక్షాళనను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు ముందుగా తుది జట్టులో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడించింది టీమిండియా. కేవలం 3 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. భారత్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తే.. ఇందుకు భిన్నంగా ఆసీస్.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లలో దారుణంగా విఫలమైంది. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కున్న ఈ పరాభవాన్ని ఆసీస్ మీడియా, ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ తప్పుడు నిర్ణయాలు, ఓవరాక్షన్‌లు తగ్గించుకుని ఇకనైనా వాస్తవాలు తెలుసుకోవాలని.. తప్పులు సరిదిద్దుకోకపోతే.. ఈ సిరీస్‌ను టీమిండియా వైట్‌వాష్ చేయడం ఖాయం అని మాజీ క్రికెటర్లు ఆస్ట్రేలియా జట్టును హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆసీస్ టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే జట్టు ప్రక్షాళనను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. రెండో టెస్టుకు ముందుగా తుది జట్టులో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఫామ్‌లేమితో సతమతమవుతున్న వార్నర్ స్థానంలో ట్రావిస్ హెడ్‌ను తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఇంకొందరు చెప్పేదేమిటంటే.. అలెక్స్ క్యారీకి బదులు హెడ్ తుది జట్టులోకి రానుండగా.. హ్యాండ్స్‌కంబ్ బదులుగా క్రిస్ గ్రీన్, రెన్‌షా స్థానంలో కుహ్‌నెమన్, బొలాండ్ స్థానంలో మిచిల్ స్టార్క్ రెండో టెస్టులోకి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయట.
తొలి టెస్టులో భారత స్పిన్ ద్వయం అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడంలో ఆసీస్ జట్టు పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్‌కు ముందుగా ప్రాక్టిస్ సెక్షన్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓవరాక్షన్ చేసింది గానీ.. బరిలోకి దిగేసరికి మొత్తంగా చతికిలబడింది. కాగా, మొదటి టెస్ట్ విజయంతో టీమిండియా బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా జరుగుతుంది.