Cricket Sensation: 126 బంతుల్లో 306 పరుగులు చేసిన 14 ఏళ్ల చిన్నది.. బీహార్ నుంచి మరో వండర్ కిడ్
Cricket Sensation : బీహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం అక్షరా గుప్తా అండర్ 19 టోర్నీలో 126 బంతుల్లో 306* పరుగులతో ట్రిపుల్ సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ తర్వాత బీహార్ నుంచి మరో అద్భుత రికార్డు నమోదైంది.

Cricket Sensation: భారత క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున అద్భుత ప్రదర్శన చేసిన ఈ కుర్రాడు.. తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు తరఫున ఆడుతున్న వైభవ్, అతి త్వరలోనే సీనియర్ భారత జట్టు జెర్సీని ధరించబోతున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లతో పాటు ఆసియా గేమ్స్ 2026 జట్టులోనూ ఈ యువ బ్యాటర్‌కు చోటు దక్కింది. ఒకవేళ రాబోయే సిరీస్‌లో వైభవ్ అరంగేట్రం చేస్తే.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుంది. భారతదేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.
బీహార్ నుంచి మరో నయా సంచలనం
వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే, బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో మరో అద్భుతం జరిగింది. బీహార్‌లోని ఈస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల అక్షరా గుప్తా మైదానంలో పరుగుల వరద పారించింది. భాగల్పూర్‌లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ చిన్నారి ఏకంగా అజేయ ట్రిపుల్ సెంచరీ (306* రన్స్) బాది అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. కేవలం 126 బంతుల్లోనే ఆమె ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.
సిక్సర్లు, ఫోర్ల వర్షం.. రికార్డులు బద్దలు
అక్షరా గుప్తా ఇన్నింగ్స్ చూస్తే ఎంతటివారైనా సరే వావ్ అనాల్సిందే. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వండర్ గర్ల్.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును దాటేసింది. ఆమె ఆడిన ఈ సుడిగాలి ఇన్నింగ్స్‌లో మొత్తం 42 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. ముంబైకి చెందిన ఇరా గుప్తా పేరిట ఉన్న 346* పరుగుల ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని అక్షర తృటిలో కోల్పోయింది. అయినప్పటికీ, మహిళల దేశవాళీ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా అక్షర రికార్డులకెక్కింది.
ఎవరీ అక్షరా గుప్తా?
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన అక్షరా గుప్తా, ఫాస్ట్ బౌలింగ్‌ను ఎంతో అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎంతటి బౌలర్ అయినా సరే భయపడకుండా తనదైన శైలిలో షాట్లు కొట్టడం ఆమె ప్రత్యేకత. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర, తన ప్రతిభతో సీనియర్ రాష్ట్ర జట్టులోకి కూడా దూసుకెళ్లింది. అయితే, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఇంకా మెరుగుపడాలని కొందరు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఆమె టీమిండియాకు ఆడటం ఖాయమని వారు జోస్యం చెబుతున్నారు.
క్రికెటర్ల ఫ్యాక్టరీగా మారుతున్న బీహార్
బీహార్ క్రికెట్ అసోసియేషన్ (BCA) అధ్యక్షుడు హర్షవర్ధన్, సెక్రటరీ జియావుల్ అర్ఫిన్ అక్షరా గుప్తా అద్భుత విజయానికి అభినందనలు తెలిపారు. బీహార్ రాష్ట్రం క్రికెట్ రంగంలో సాధిస్తున్న ప్రగతికి ఈ విజయమే నిదర్శనమని వారు కొనియాడారు. ఇటీవలి కాలంలో బీహార్ నుంచి ఎంతోమంది అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. వైభవ్ సూర్యవంశీతో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన సాకిబ్ హుస్సేన్ కూడా రాణించాడు. వీరితో పాటు ఇషాన్ కిషన్, జీషాన్ అన్సారీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, అనుకూల్ రాయ్ వంటి ఎందరో స్టార్ క్రికెటర్లను బీహార్ అందించింది. అయితే, సరైన మౌలిక సదుపాయాలు, మెరుగైన శిక్షణా సౌకర్యాల కోసం కొంతమంది ఆటగాళ్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
