
Bihar Captain Sakibul Ghani: భారత దేశవాళీ క్రికెట్‌లో బీహార్ కెప్టెన్ సకిబుల్ ఘనీ (Sakibul Gani) సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, లిస్ట్-ఏ (List-A) క్రికెట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు.
రాంచీలోని JSCA ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సకిబుల్ ఘనీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న ఆయన 10 ఫోర్లు, 12 భారీ సిక్సర్ల సాయంతో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో ఆయన టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అదే రోజు జరిగిన మరో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కర్ణాటకపై 33 బంతుల్లో సెంచరీ చేయగా, ఘనీ అంతకంటే ఒక బంతి తక్కువగానే (32 బంతుల్లో) ఈ ఘనత సాధించడం విశేషం.
సకిబుల్ ఘనీ సెంచరీతో పాటు, 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (190 పరుగులు) కూడా అద్భుత ప్రదర్శన చేయడంతో బీహార్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు. గతంలో తమిళనాడు పేరిట ఉన్న 506 పరుగుల రికార్డును బీహార్ తుడిచిపెట్టేసింది.
సకిబుల్ ఘనీకి రికార్డులు సృష్టించడం కొత్తేమీ కాదు. 2022లో మిజోరాంపై జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆయన, తన డెబ్యూ మ్యాచ్‌లోనే 341 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా ఆయన అప్పట్లో వార్తల్లో నిలిచారు.
తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన ఈ 25 ఏళ్ల యువ క్రికెటర్, తన నిలకడైన ఆటతీరుతో, వేగవంతమైన బ్యాటింగ్‌తో భారత జాతీయ జట్టులోకి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..