
India vs New Zealand T20I Series: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో తిలక్ వర్మకు రాజ్‌కోట్‌లో అకస్మాత్తుగా కడుపు నొప్పి (Abdominal issue) రావడంతో బుధవారం అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది.
బీసీసీఐ తెలిపిన వివరాల ప్రకారం, “తిలక్ వర్మకు బుధవారం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గురువారం ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. శుక్రవారం తన స్వస్థలమైన హైదరాబాద్‌కు చేరుకుంటాడు. గాయం పూర్తిగా నయమై, శారీరకంగా ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే ఆయన తిరిగి నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెడతాడు” అని తెలిపింది.
తిలక్ వర్మ మొదటి మూడు టీ20 మ్యాచ్‌లకు (జనవరి 21 నుండి ప్రారంభం) ఖచ్చితంగా దూరమవుతారు. ఆ తర్వాత ఆయన కోలుకునే తీరును బట్టి, చివరి రెండు టీ20 మ్యాచ్‌లలో ఆడతారా లేదా అనేది వైద్య బృందం నిర్ణయిస్తుంది.
తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులకు తిలక్ వర్మ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాను త్వరగా కోలుకుంటున్నానని, అభిమానులు ఆశించిన దానికంటే ముందే మళ్ళీ మైదానంలోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశాడు.
తిలక్ వర్మ దూరం కావడంతో నంబర్-3 స్థానంలో ఎవరు ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీసీసీఐ ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించలేదు. అయితే, స్క్వాడ్‌లో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌ను మూడవ స్థానంలో ఆడించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా కొనసాగితే, ఇషాన్ కిషన్ బ్యాటర్‌గా జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ లేకపోవడం టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికీ, యువ భారత్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తిలక్ వర్మ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..