Cricketers Fight Video: క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు ఆటగాళ్లు గొడవపడటం సహజమే. కానీ మరీ కొట్టుకునేంతగా ఉండదు. కానీ ఒక్కసారి ఇది జరిగింది. జెంటిల్‌మెన్ గేమ్‌కి అవమానం ఎదురైంది. కానీ ఆ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. 2015లో ఈ సంఘటన జరిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ని తన్నడం, ముష్టి ఘాతాలు కురిపించడం, దీని తర్వాత ఆ బ్యాట్స్‌మన్ వికెట్ కీపర్‌ని బ్యాట్‌తో కొట్టడానికి రావడం జరిగింది. ఆ తర్వాత మైదానంలోకి పోలీసు కారు వస్తేకానీ గొడవ సద్దుమణగలేదు. ఆ సంఘటన ఏంటి.. ఎక్కడ జరిగింది.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
6 సంవత్సరాల క్రితం బెర్ముడాలో జరిగిన ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్’ టోర్నమెంట్‌లో భాగంగా విల్లోక్యాట్స్, క్లీవ్‌ల్యాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆట మధ్యలో క్లీవ్‌ల్యాండ్ వికెట్ కీపర్ జాసన్ ఆండర్సన్ విల్లోకాట్ బ్యాట్స్‌మెన్ జార్జ్ ఓబ్రెయిన్‌పై ఏదో పంచ్ వేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్యాట్స్‌మన్ కొట్టడానికి వస్తాడు. అయితే అండర్సన్ అతడిపై ముష్టి ఘాతాలు కురిపిస్తాడు. తర్వాత గొడవ పెద్దదవుతుంది. బ్యాట్స్‌మెన్ జార్జ్ ఓబ్రెయిన్.. అండర్సన్‌ను బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఆపై ఆటగాళ్లిద్దరూ మైదానంలో కిందపడిపోయి ఒకరినొకరు ఘోరంగా కొట్టుకుంటారు. సహచరులు ఇద్దరిని ఎంత ఆపినా ఆగరు. దీంతో మైదానంలోకి పోలీసులు రంగప్రవేశం చేస్తారు. వీడియో చూస్తే మీకు సీన్ మొత్తం అర్థమవుతుంది.
అండర్సన్‌పై జీవితకాల నిషేధం
ఈ గొడవ తర్వాత క్లీవ్‌ల్యాండ్ కౌంటీని మ్యాచ్ విజేతగా ప్రకటించారు. బెర్ముడా క్రికెట్ బోర్డు మొత్తం సంఘటన వీడియోను వీక్షించింది. విచారణ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు క్రికెట్ ప్రవర్తనా నియమావళి లెవల్ 3, 4 ఉల్లంఘనలకు పాల్పడ్డారు. వికెట్ కీపర్ అండర్సన్ జీవితకాల నిషేధానికి గురయ్యాడు. క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఓ’బ్రియన్‌ని లెవల్ 3 దోషిగా నిర్ధారించారు. 6 సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధించారు. నిజానికి ఈ ఘటన క్రికెట్ ఆటకి మాయని మచ్చగా మిగిలింది.