
IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే విషయంలో ఐసీసీకి, బంగ్లాదేశ్‌కు మధ్య జరుగుతున్న వివాదంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. బంగ్లాదేశ్‌ను తప్పుదారి పట్టిస్తూ, వారిని రెచ్చగొడుతున్నందుకు ఆయన పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే చివరి నిమిషంలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ మొత్తాన్ని మార్చడం సాధ్యం కాదని తెలిపారు. రాబోయే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ అధికారికంగా వచ్చిందని ఐసీసీ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాకిస్థాన్ అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటోందని, బంగ్లాదేశ్‌ను రెచ్చగొడుతోందని రాజీవ్ శుక్లా విమర్శించారు.
జనవరి 24, 2026 శనివారం నాడు ఐసీసీ ప్రకటించిన ఈ నిర్ణయంతో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఐసీసీ మధ్య వారాల తరబడి సాగిన ప్రతిష్టంభన ముగిసింది. జాతీయ జట్టును భారత్‌కు పంపడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే.
“ఈ విషయంలో పాకిస్థాన్ అనవసరంగా చేరింది. బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టడంలో పాక్ కీలక పాత్ర పోషిస్తోంది. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు గతంలో ఏం చేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు, బంగ్లాదేశీయులకు కూడా తెలుసు. ఇప్పుడు పాకిస్థాన్ సానుభూతిపరులవలే నటిస్తూ బంగ్లాదేశ్‌ను తప్పుడు మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది” అని రాజీవ్ శుక్లా ఏఎన్ఐతో అన్నారు.
ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 2026 సీజన్ కోసం విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ వార్తల తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిని బంగ్లాదేశీయుల భద్రతకు ముప్పుగా బీసీబీ భావించింది. అయితే ఐసీసీ తన విచారణలో బంగ్లాదేశ్ జట్టుకు భారత్‌లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని తేల్చి చెప్పింది. బుధవారం జరిగిన సమావేశం తర్వాత, బంగ్లాదేశ్‌ను 24 గంటల్లోగా తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించాలని ఐసీసీ కోరింది. నిర్ణీత గడువులోగా స్పందన రాకపోవడంతో, నిబంధనల ప్రకారం అత్యధిక ర్యాంకు కలిగిన స్కాట్లాండ్‌ను రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ ఎంపిక చేసింది.