ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!

15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులో చోటు దక్కించుకున్నా ఇంకా అరంగేట్రం చేయలేదు. దీనిపై అభిమానుల నుంచి విమర్శలు వస్తుండగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సరైన సమయంలో అవకాశం వస్తుందని స్పష్టం చేస్తూ జట్టు యాజమాన్యంపై విశ్వాసం ఉంచాలని కోరారు.

ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ!
Vaibhav Suryavanshi

Updated on: Jul 03, 2026 | 5:52 PM

కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై నెలకొన్న ఉత్కంఠకు బీసీసీఐ స్పందించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కినా, ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం రాకపోవడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. జట్టులో ఎంపిక కావడమే వైభవ్ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అతనిపై జట్టు యాజమాన్యానికి పూర్తి నమ్మకం ఉందని, సరైన సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. కోచ్‌లు, సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను గౌరవించాలని, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, రాజకీయ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

వైభవ్ సూర్యవంశీ ఎంపికతోనే ఇప్పటికే చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచి, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. అయితే ఇప్పటివరకు అతను బెంచ్‌కే పరిమితమవ్వడంతో అభిమానులు అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, భారత జట్టు యాజమాన్యం మాత్రం ప్రస్తుత విజయవంతమైన జట్టులో మార్పులు చేయడానికి తొందరపడడం లేదు. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీల్లో విజయాలు సాధించింది. అదే విజయవంతమైన కాంబినేషన్‌ను కొనసాగించాలనే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్కేట్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్న ఆయన, ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు సామ్సన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లను పక్కనబెట్టి వెంటనే అవకాశం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జట్టులోని ఆటగాళ్లు గత టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని, వారికి అవసరమైన భరోసా, అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని అన్నారు. ఒక్క ఆటగాడి కోసం ఇప్పటికే రాణిస్తున్న వారిని తప్పించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. దీంతో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ, బీసీసీఐ మాత్రం సరైన సమయంలోనే అతనికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us