IPL 2026 : రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా అంతే.. హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్.. ఆర్సీబీ ప్లేయర్‎కు డిమెరిట్ పాయింట్

IPL 2026 : ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు స్లో ఓవర్ రేటు కారణంగా బీసీసీఐ రూ. 12 లక్షల జరిమానా విధించింది. అదే విధంగా ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25% కోత పడింది. అంపైర్లతో అనుచిత ప్రవర్తనకు ఈ భారీ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

IPL 2026 : రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా అంతే.. హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్.. ఆర్సీబీ ప్లేయర్‎కు డిమెరిట్ పాయింట్
Hardik Pandya

Updated on: Apr 14, 2026 | 6:33 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరదతో పాటు జరిమానాల వర్షం కూడా కురుస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య పోరు ముగిసిన వెంటనే.. బీసీసీఐ ఇద్దరు కీలక ఆటగాళ్లపై కొరడా ఝులిపించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా విధించగా, ఆర్సీబీ పవర్‌ హిట్టర్ టిమ్ డేవిడ్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని మ్యాచ్ ఫీజులో కోత విధించింది.

హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ సీజన్ అస్సలు కలిసి రావడం లేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఈ బాధలో ఉండగానే బీసీసీఐ అతనికి మరో షాక్ ఇచ్చింది. నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నందుకు (స్లో ఓవర్ రేట్) హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్‌పై మాత్రమే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కెప్టెన్లు కూడా ఇదే తప్పు చేసి బోర్డు ఆగ్రహానికి గురయ్యారు.

టిమ్ డేవిడ్ బంతి ఆట.. అంపైర్ల సీరియస్

అయితే హార్దిక్ కంటే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసిన పని పెద్ద చర్చకు దారితీసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి పాడైపోవడంతో అంపైర్లు దానిని మార్చాలని నిర్ణయించారు. కొత్త బంతిని ఎంచుకున్నప్పుడు టిమ్ డేవిడ్ అంపైర్ల దగ్గరికి వెళ్లి ఆ బంతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంపైర్లు బంతిని వెనక్కి అడుగుతున్నా వినకుండా.. దానిని పదేపదే పైకి విసిరి టెస్ట్ చేశాడు. తనకు నచ్చిన బంతిని ఇస్తున్నారా లేదా అని చెక్ చేసిన తీరు అంపైర్లకు ఆగ్రహం తెప్పించింది. దాదాపు నాలుగు ఐదు సార్లు అలా ప్రవర్తించడంతో అంపైర్లు బలవంతంగా బంతిని లాక్కోవాల్సి వచ్చింది.

మ్యాచ్ ఫీజులో కోత.. డిమెరిట్ పాయింట్

టిమ్ డేవిడ్ ఇదే ప్రవర్తనను చివరి ఓవర్‌లో కూడా పునరావృతం చేయడంతో అంపైర్లు మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేవలం జరిమానాతోనే కాకుండా అతని ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ కూడా చేర్చారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడి ఖాతాలో డిమెరిట్ పాయింట్లు పెరిగితే, భవిష్యత్తులో మ్యాచ్‌ల నుంచి నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ విజయం సాధించి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చింది. కానీ ఆటగాళ్ల ప్రవర్తన, స్లో ఓవర్ రేట్ కారణంగా వచ్చిన జరిమానాలు మాత్రం ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఐపీఎల్ 2026లో బీసీసీఐ క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడటం లేదని ఈ చర్యల ద్వారా స్పష్టమవుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us