
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా సాగుతున్న హైడ్రామాలో బంగ్లాదేశ్ మరో అనూహ్య మలుపు తిరిగింది. మెగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆ దేశం, కేవలం 20 రోజుల వ్యవధిలోనే తన మాట మార్చేసింది. గత నెలలో ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పిన బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అసలు ఆ నిర్ణయానికీ ప్రభుత్వానికీ సంబంధమే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ పరిణామం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
జనవరి 22న బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మీడియాతో మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ విషయాన్ని ఆటగాళ్లకు కూడా వివరించానని చెప్పారు. దేశ గౌరవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బిల్డప్ ఇచ్చారు. అయితే ఆ సమయంలోనే స్టార్ ప్లేయర్ లిట్టన్ దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నిర్ణయంలో ఆటగాళ్ల ప్రమేయం అస్సలు లేదని, తమకు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారని ఆయన కుండబద్దలు కొట్టారు.
కానీ, సరిగ్గా 20 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 10న ఆసిఫ్ నజ్రుల్ మాట మార్చేశారు. వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, అది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరియు ఆటగాళ్ల సమిష్టి నిర్ణయమని చెప్పుకొచ్చారు. దేశ క్రికెట్ మనుగడ కోసం వారు ఈ త్యాగం చేశారని కొత్త భాష్యం చెప్పారు.
ఐసీసీ సాఫ్ట్ కార్నర్ వెనుక మతలబు ఏంటి?
మెగా టోర్నీ నుంచి తప్పుకున్నప్పటికీ, ఐసీసీ బంగ్లాదేశ్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే భారీ జరిమానాలు లేదా సస్పెన్షన్ విధిస్తారు. కానీ ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్‌పై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోంది. భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు బంగ్లాదేశ్‌కు అవకాశం ఉంటుందని కూడా హామీ ఇచ్చింది. ఐసీసీ ఈ విధంగా స్పందించడంతోనే, బంగ్లాదేశ్ ప్రభుత్వం సేఫ్ సైడ్ ఉండటానికి ఈ నిర్ణయం బోర్డుదే అని ప్లేట్ ఫిరాయించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఒత్తిడి ఉందా?
బయటి ప్రపంచానికి ఇది బోర్డు నిర్ణయం అని చెబుతున్నా, దీని వెనుక పాకిస్థాన్‌తో ఉన్న లోపాయికారీ ఒప్పందాలు లేదా ఇతర దౌత్య కారణాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌పై మొండికేసి వెనక్కి తగ్గిన నేపథ్యంలో, బంగ్లాదేశ్ ఒంటరి కాకుండా ఉండేందుకు తన వాదనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బంగ్లాదేశ్ చేసిన ఈ యూ-టర్న్ ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..