Watch: తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ మార్క్ స్క్వేర్ డ్రైవ్‌లతో మైండ్ బ్లాక్ చేసిన ఆర్యవీర్

Watch: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తన తండ్రి మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడిన అతడి స్క్వేర్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్ అచ్చం సెహ్వాగ్ బ్యాటింగ్‌ను తలపించాయి. డీపీఎల్ నిర్వాహకులు షేర్ చేసిన తండ్రీకొడుకుల పోలిక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ మార్క్ స్క్వేర్ డ్రైవ్‌లతో మైండ్ బ్లాక్ చేసిన ఆర్యవీర్
Aryavir Sehwag

Updated on: Aug 25, 2026 | 12:30 PM

Watch: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రమాదకర ఓపెనర్లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ వారసత్వాన్ని ఆయన కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) టోర్నీలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున బరిలోకి దిగిన ఆర్యవీర్, మైదానంలో తన తండ్రి మార్క్ షాట్లను అచ్చంగా దింపి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. టీమిండియా తరఫున 374 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 17,253 పరుగులు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌లో ఎన్నో అద్భుత రికార్డులను తిరగరాశాడు. 38 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో నిద్రపోయిన సెహ్వాగ్ శైలి ప్రత్యేకమైనది. ఇప్పుడు ఆయన కొడుకు ఆర్యవీర్ కూడా సరిగ్గా అదే విధమైన భయం లేని బ్యాటింగ్ వైఖరితో అలరిస్తున్నాడు. డీపీఎల్ మ్యాచ్‌లో ఆర్యవీర్ కొట్టిన స్క్వేర్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్ అచ్చం సెహ్వాగ్ షాట్లను తలపించాయి. ఈ తండ్రీకొడుకుల బ్యాటింగ్ పోలికలతో కూడిన వీడియోను డీపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.

శనివారం సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 232 పరుగుల కొండంత స్కోరు సాధించింది. ఓపెనర్ సిద్ధార్థ్ జూన్ 17 బంతుల్లోనే 33 పరుగులు బాదగా, సమర్థ్ సేథ్ 14 బంతుల్లో 37 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు విపరీతమైన వేగం తెచ్చారు.

ఇది కూడా చదవండి: IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్

233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఆరంభం నుంచే విరుచుకుపడింది. కేవలం 4.5 ఓవర్లలోనే 71/2 స్కోరుతో లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఆర్యవీర్ సెహ్వాగ్ త్వరగానే అవుటైనప్పటికీ, క్రిష్ యాదవ్ (26 బంతుల్లో 46), అంకిత్ కుమార్ (30 బంతుల్లో 61) నాలుగో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. అంకిత్ కుమార్ 4 ఫోర్లు, 5 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టును గెలిపించేందుకు శాయశక్తులా పోరాడాడు.

ఇది కూడా చదవండి: Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం

ముఖ్యమైన సమయంలో తేజస్ బరోకా బౌలింగ్‌లో క్రిష్ యాదవ్ అవుట్ కావడం వెస్ట్ ఢిల్లీ లయన్స్‌పై తీవ్ర ఒత్తిడి పెంచింది. ఆ తర్వాత అంకిత్ కుమార్ కూడా పెవిలియన్ చేరడంతో రన్ రేట్ బాగా పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లలో వెస్ట్ ఢిల్లీ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోవడంతో 20 ఓవర్లు ముగిసేసరికి 211/8 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ ఓటమి పాలైనప్పటికీ, ఆర్యవీర్ సెహ్వాగ్ చూపించిన బ్యాటింగ్ నైపుణ్యం క్రికెట్ వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది. తండ్రిలాగే భయం లేని ఆటతీరుతో విరుచుకుపడుతున్న ఆర్యవీర్ రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి ఎదుగుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us