HCA Apex Council rejects: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం రచ్చ రచ్చగా మారింది. ఈ సమావేశానికి 186 మంది క్లబ్ సెక్రేటరీలు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చింది.
కాగా అంబుడ్స్‌మెన్‌గా దీపక్‌వర్మను నియమించాలని అజారుద్దీన్ వర్గం పట్టుబడుతుంటే.. వ్యతిరేక వర్గం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంపై అధ్యక్షుడు అజారుద్దీన్‌ను HCA సభ్యులు ప్రశ్నించారు. దీంతో సమావేశం కాస్త రసాభాసగా మారడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు మధ్యలోనే బయటికి వచ్చి మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయిందని వి.హన్మంతరావు ఆరోపించారు. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదని మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదన్నారు.ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది.అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదని ఆరోపించారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రెసిడెంట్ అజారుద్దీన్‌కు అధికార పార్టీ అండదండలు వున్నాయని మండిపడ్డారు. మరోవైపు ఏప్రిల్ 11న మరోసారి హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.