
Aman Yadav: ప్రస్తుతం జరుగుతున్న అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అస్సాం జట్టు కెప్టెన్ అమన్ యాదవ్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన కేవలం 6 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 5 సెంచరీలు బాది రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఒక సీజన్‌లో ఒకటి లేదా రెండు సెంచరీలు చేయడమే గొప్ప విషయం అనుకుంటే, అమన్ మాత్రం ప్రతి మ్యాచ్‌లోనూ అజేయంగా నిలుస్తూ తన బ్యాటింగ్ పవర్‌ను చూపిస్తున్నాడు.
కీలక ఇన్నింగ్స్‌లు: అమన్ యాదవ్ కేవలం సెంచరీలు చేయడమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడంలోనూ ముందున్నాడు. అతను సాధించిన కొన్ని అద్భుత స్కోర్లు ఇవే:
కేరళపై 173 పరుగులు (అత్యధిక వ్యక్తిగత స్కోరు)
ముంబైపై నాటౌట్‌గా 166 పరుగులు.
బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ జట్లపై కూడా సెంచరీలతో సత్తా చాటాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌ల్లో 749 పరుగులు సాధించాడు. అతని సగటు, స్ట్రైక్ రేట్ చూస్తుంటే ఒక పరిణతి చెందిన సీనియర్ ఆటగాడిని తలపిస్తోంది.
రియాన్ పరాగ్ ప్రశంసలు.. అస్సాం స్టార్ క్రికెటర్, టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ కూడా అమన్ యాదవ్ ప్రతిభను కొనియాడాడు. సోషల్ మీడియా వేదికగా అమన్ రికార్డులను షేర్ చేస్తూ, “భారత క్రికెట్ భవిష్యత్తు భద్రంగా ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్న తరుణంలో, అమన్ యాదవ్ ప్రదర్శన కూడా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అమన్ కేవలం బ్యాటింగ్‌లోనే కాదు, బౌలింగ్‌లోనూ రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 18 వికెట్లు తీసి జట్టుకు అవసరమైన సమయంలో బ్రేక్ త్రూలు అందిస్తున్నాడు. అస్సాం క్రికెట్ అసోసియేషన్ (ACA) ఈ యువ కెరటాన్ని ప్రోత్సహిస్తూ, సరైన శిక్షణ అందిస్తోంది.
చిన్న వయసులోనే అసాధారణమైన ఏకాగ్రత, పట్టుదలతో ఆడుతున్న అమన్ యాదవ్, ఇలాగే తన ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే టీమిండియా అండర్-19, ఐపీఎల్ (IPL) వేదికలపై మెరవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అస్సాం నుంచి మరో గొప్ప క్రికెటర్ వస్తున్నాడని క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.