Gautam Gambhir : గౌతమ్ గంభీర్ ముందు మూడు పెద్ద సవాళ్లు.. వారంలోగా పరిష్కారం కనుగొకలేకపోతే

ఇంగ్లాండ్‌పై మూడో టెస్ట్ ఓటమితో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ ముందు మూడు పెద్ద సమస్యలు వచ్చాయి. బుమ్రా స్థానం, పంత్ గాయం, కరుణ్ నాయర్ ఫామ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. టీమిండియా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. ఒక్క మ్యాచులో కూడా భారత్ గెలవలేదు.

Gautam Gambhir :  గౌతమ్ గంభీర్ ముందు మూడు పెద్ద సవాళ్లు.. వారంలోగా పరిష్కారం కనుగొకలేకపోతే
Gautam Gambhir

Updated on: Jul 15, 2025 | 6:21 PM

Gautam Gambhir : లీడ్స్‌లో స్వల్ప తేడాతో ఓటమి తర్వాత, టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రక విజయాన్ని అందుకుంది. అయితే, లార్డ్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి సిరీస్‌లో 1-2తో వెనకబడింది. మూడో టెస్ట్‌లో విజయం సాధించడానికి భారత్‌కు కేవలం 193 పరుగులే అవసరం ఉన్నా, టాప్ ఆర్డర్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయినప్పటికీ, రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసి విజయంపై ఆశలు కలిగించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ఇప్పుడు, మిగిలిన రెండు టెస్ట్‌ల ముందు భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ముందు మూడు పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటికి ఆయన వారం రోజుల్లోగా పరిష్కారం కనుగొనాలి.

లార్డ్స్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 82 పరుగులకే 7వ వికెట్‌ను వాషింగ్టన్ సుందర్ రూపంలో కోల్పోయింది. అంతకుముందు, 81 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (39) తన వికెట్‌ను కోల్పోయాడు. అయితే, ఆ తర్వాత రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతనికి మరోవైపు నుంచి ఎటువంటి సహకారం లభించలేదు. చివరికి టీమిండియా 170 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఓటమితో గంభీర్ ముందు మూడు పెద్ద ప్రశ్నలు ఎదురయ్యాయి.

భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ జులై 23 నుంచి మాంచెస్టర్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)లో జరగనుంది. అంతలోపే గంభీర్ ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలి.

జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరొస్తారు ?
బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడలేదు. అతని స్థానంలో ఆకాశ్‌దీప్ ఆడాడు. ఆకాశ్‌దీప్ అద్బుతంగా ఆడడంతో అతడిని మూడో టెస్ట్‌లోనూ కొనసాగించారు. ప్రస్తుతం, బుమ్రా నాలుగో టెస్ట్‌ కూడా ఆడకపోతే, ఆ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తిరిగి తీసుకురావడం కష్టం. ఎందుకంటే అతను గత రెండు టెస్ట్‌లలో చాలా పరుగులిచ్చాడు. అందుకే మాంచెస్టర్ టెస్ట్‌లో అర్షదీప్ సింగ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు. బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతారని, అందులో రెండు టెస్టులు ఇప్పటికే ఆడాడు కాబట్టి, ఇది గంభీర్‌కు ఒక పెద్ద సవాలు.

రిషబ్ పంత్ గాయం ఎంత తీవ్రమైంది?
లార్డ్స్ టెస్ట్‌ మొదటి రోజునే రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ సమయంలో వేలికి గాయం కావడంతో అతడు స్టేడియం విడిచి వెళ్లిపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. పంత్ బ్యాటింగ్ చేసినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. గాయంతో పంత్ ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేయడం స్పష్టంగా కనిపించింది. పంత్ పూర్తిగా ఫిట్‌గా లేకపోతే అతడిని ఆడించడం జట్టుకు నష్టాన్ని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్నారు.

కరుణ్ నాయర్‌కు ఇంకెంత కాలం ఛాన్స్ ఇస్తారు ?
గౌతమ్ గంభీర్‌కు మరో పెద్ద తలనొప్పి కరుణ్ నాయర్. గత మూడు టెస్టులలో అతను ఆడినప్పటికీ తపు చెప్పుకోదగిన విధంగా ఆడలేకపోయాడు. ముఖ్యమైన సమయాల్లో వికెట్ కోల్పోవడం వల్ల సోషల్ మీడియాలో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దాదాపు 8 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన నాయర్, తన ప్రదర్శనతో మెప్పించలేక విమర్శలకు గురవుతున్నాడు. సాయి సుదర్శన్ మొదటి టెస్ట్‌లో అరంగేట్రం చేసినా, విఫలం కావడంతో అతడిని రెండో టెస్ట్ నుంచి తప్పించారు. కరుణ్ నాయర్ వరుసగా మూడు అవకాశాలను కోల్పోయాడు. ఇప్పుడు నాలుగో టెస్ట్‌లో అతడిని ఆడించాలా, లేక అతని స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలా అనేది గంభీర్ ముందున్న పెద్ద ప్రశ్న.

ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్ రికార్డ్ విషయానికి వస్తే అక్కడ మొత్తం 9 మ్యాచులు ఆడింది. ఇందులో 4 మ్యాచుల్లో ఇంగ్లాండ్ గెలిచింది. భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మిగిలిన ఐదు మ్యాచులు డ్రా అయ్యాయి. టీమిండియా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇప్పటివరకు 9 టెస్టులు ఆడింది. అయితే, ఈ గ్రౌండ్‌లో భారత్ రికార్డ్ అంత బాగా లేదు. నాలుగో టెస్ట్ ఇదే గ్రౌండ్‌లో జులై 23 నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..