Ex-KKR Player : ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు..సత్తా చూడకుండా కేకేఆర్ వదిలేసిన డైమండ్

Ex-KKR Player : మాజీ కేకేఆర్ ప్లేయర్ ఆర్య దేశాయ్ టీ20ల్లో సంచలనం సృష్టించాడు. సూరత్ క్రికెట్ లీగ్‌లో కేవలం 81 బంతుల్లోనే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో 193 పరుగులు చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ 2026కు ముందు ఆర్య దేశాయ్ ఇలాంటి ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది.

Ex-KKR Player : ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు..సత్తా చూడకుండా కేకేఆర్ వదిలేసిన డైమండ్
Aarya Desai

Updated on: Mar 21, 2026 | 9:00 AM

Ex-KKR Player : ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందే ఒక 22 ఏళ్ల కుర్రాడు మైదానంలో పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఒకప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నమ్మి తీసుకుని, ఆ తర్వాత వదిలేసిన ఆర్య దేశాయ్.. ఇప్పుడు తన బ్యాట్‌తో ఆ జట్టుకు చుక్కలు చూపించే రేంజ్‌లో చెలరేగిపోయాడు. సూరత్ క్రికెట్ లీగ్ 2026లో భాగంగా మార్చి 20న జరిగిన మ్యాచ్‌లో ఈ యువ ఓపెనర్ ఆడిన ఇన్నింగ్స్ చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. సూరత్ క్రికెట్ లీగ్ 2026లో భాగంగా లూత్రా పెగసాస్, కైలాష్ స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్య దేశాయ్ ఊహించని రీతిలో చెలరేగిపోయాడు. లూత్రా పెగసాస్ జట్టుకు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆర్య.. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 81 బంతుల్లోనే 238.27 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు, 21 ఫోర్లు ఉండటం విశేషం. ఏ టీ20 లీగ్‌లోనైనా ఇప్పటివరకు నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఇది రికార్డు సృష్టించింది.

ఒక్కడే జట్టు స్కోరును దాటేశాడు

లూత్రా పెగసాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందులో ఆర్య దేశాయ్ ఒక్కడే 193 పరుగులు చేయడం గమనార్హం. 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కైలాష్ స్పోర్ట్స్ క్లబ్ జట్టు.. కనీసం ఆర్య దేశాయ్ చేసిన స్కోరును కూడా అందుకోలేకపోయింది. ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 174 పరుగులకే పరిమితమైంది. దీంతో లూత్రా పెగసాస్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆర్య దేశాయ్ బ్యాటింగ్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు బంతులు వేయడానికే భయపడే పరిస్థితి కనిపించింది.

కేకేఆర్‎తో ఉన్న పాత కనెక్షన్

ఆర్య దేశాయ్ ప్రతిభను గుర్తించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఐపీఎల్ 2023లో రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా కేవలం రూ.20 లక్షలకు తనతో ఒప్పందం చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు ఆ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. ఆ తర్వాత సీజన్ నుంచి కేకేఆర్ అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఇప్పుడు అదే ఆటగాడు టీ20ల్లో ఇంతటి విధ్వంసం సృష్టించడం చూసి, అతన్ని వదులుకొని కేకేఆర్ తప్పు చేసిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 ముందు సంచలనం

మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026కు ముందు ఆర్య దేశాయ్ ఇలాంటి ప్రదర్శన చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏ ఆటగాడైనా వన్డేల్లో కూడా చేయడానికి కష్టపడే స్కోరును, ఈ 22 ఏళ్ల కుర్రాడు టీ20ల్లోనే చేసి చూపించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భవిష్యత్తులో టీమిండియా తరఫున కూడా సత్తా చాటుతానని ఆర్య పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఈ యువ ఆటగాడిపై ఒక కన్నేసి ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us