Yadadri Temple Pavithrotsavam: యాదాద్రిలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు.. పలు సేవలు రద్దు..

Yadadri Temple Pavithrotsavam: ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. మూడు మూడు రోజులపాటు జరగనున్న ఈ పవిత్ర ఉత్సవాల కోసం అధికారులు ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేశారు.

Yadadri Temple Pavithrotsavam: యాదాద్రిలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు.. పలు సేవలు రద్దు..
Yadagirigutta Temple

Edited By: Sanjay Kasula

Updated on: Aug 22, 2023 | 9:44 PM

యాదాద్రి, ఆగస్టు 22: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రంలో ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 26 నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందుకోసం దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ శుద్ధ దశమి నుంచి ద్వాదశి వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. మూడు మూడు రోజులపాటు జరగనున్న ఈ పవిత్ర ఉత్సవాల కోసం అధికారులు ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేశారు.

ఏడాది పాటు ఆలయంలో పూజల్లో, భక్తుల నుంచి తెలిసి తెలియక జరిగిన తప్పులు, దోషాలను చెరిగిపోయేందుకు ప్రతి సంవత్సరం పవిత్ర ఉత్సవాలను లోకకల్యాణం.. దోష నివారణకు నిర్వహించడం ఆనవాయితీ. పంచ నారసింహ రూపాల్లో తన భక్తులకు దర్శనం ఇస్తున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుని పూజలు చేస్తుంటారు. స్వామివారి కైకర్యాలు భక్తులు నిర్వహించే పూజల్లో ఏమైనా దోషాలు, లోపాలు ఉంటే వాటి నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నరసింహచార్యులు చెబుతున్నారు. భక్తులు చేసే పూజలు తప్పులు దోషాలు దొర్లినా క్షమించి.. తనను నమ్మిన భక్తుల వెన్నంటి ఉండి అనునిత్యం వారి యోగక్షేమాలు స్వామివారు చూస్తుంటారని భక్తుల విశ్వాసం.

ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగాలని పాంచరాత్రాగమ శాస్త్ర పద్ధతిలో విశ్వక్సేనుడికి తొలి పూజలు చేస్తారు. ఆలయంలో స్వస్తి పుణ్య హవాచనంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. రెండవ రోజు పారాయణం, హవనం, మూలమంత్ర జపం, చక్రాబ్ది మండల ఆరాధన నిర్వహిస్తారు. మూడవ రోజు మహా పూర్ణాహుతి, శ్రీసుదర్శన ఆళ్వారుడు, స్వయంభువులు, ఉప ఆలయాల్లోని దేవతా మూర్తులకు పవిత్ర మాలల పర్వం చేపడుతారు. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందికి పవిత్ర మాలలను అందజేస్తారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. పవిత్రోత్సవాలు జరిగే ఈ నెల 27, 28వ తేదీల్లో రెండు రోజుల పాటు శ్రీ స్వామి వారి నిత్య కల్యాణం, నిత్య బ్రహ్మోత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హోమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 29వ తేదీ నుంచి యథావిధిగా శ్రీ స్వామి వారి నిత్య కైంకర్యాలు జరుగుతాయని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం