
ఇస్లామిక్ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటైన కర్బలా యుద్ధం క్రీస్తుశకం 680లో (ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. హిజ్రీ 61వ సంవత్సరం) జరిగింది. ప్రవక్త మహ్మద్ మనవడు, ఇమామ్ అలీ, ఫాతిమా కుమారుడైన ఇమామ్ హుస్సేన్ ఈ యుద్ధంలో అమరుడయ్యారు. ఈ ఘటన ముస్లిం ప్రపంచంపై గాఢమైన ప్రభావాన్ని చూపింది. ప్రవక్త మహ్మద్ మరణం తర్వాత ఖలీఫాల పాలన కొనసాగింది. అనంతరం ఉమయ్యద్ వంశానికి చెందిన యజీద్ ఇబ్న్ ముఆవియా ఖలీఫాగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే అతని పాలన విధానాలు ఇస్లాం బోధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించిన ఇమామ్ హుస్సేన్, యజీద్‌కు విధేయత ప్రకటించడానికి నిరాకరించారు. ప్రజల మద్దతుతో న్యాయం, ధర్మం, నిజాయితీ కోసం పోరాడాలని నిర్ణయించారు.
ఆ సమయంలో ఇరాక్‌లోని కూఫా ప్రజలు ఇమామ్ హుస్సేన్‌కు మద్దతు తెలుపుతూ అనేక లేఖలు పంపించారు. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కూఫా వైపు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో నేటి కర్బలా ప్రాంతంలో యజీద్ సైన్యం ఆయన బృందాన్ని చుట్టుముట్టింది. ముహర్రం నెల 10వ తేదీన, ఆశూరా రోజున జరిగిన యుద్ధంలో ఇమామ్ హుస్సేన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సహచరులు సహా సుమారు 72 మంది అమరులయ్యారు. యుద్ధానికి ముందు వారికి నీటి సరఫరా కూడా నిలిపివేశారు. చివరకు ఇమామ్ హుస్సేన్‌ను హతమార్చి, ఆయన తలను నరికి యజీద్ పాలకులకు పంపినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ ఘటనను ముస్లింలు, ముఖ్యంగా షియా ముస్లింలు, అన్యాయానికి వ్యతిరేకంగా చేసిన త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా కర్బలా అమరవీరులను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, శోక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇమామ్ హుస్సేన్ హత్య కేవలం రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, అధర్మానికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యం, న్యాయం కోసం చేసిన త్యాగానికి శాశ్వత చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయింది.