Pilgrimage: పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Pilgrimage Importance: సాధారణంగా చాలా మంది క్షేత్ర దర్శనం వృద్ధాప్యంలో చేయాలని భావిస్తారు. కానీ, నిజానికి యౌవనంలోనే పుణ్యక్షేత్రాలను దర్శించడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో శక్తి ఉంటుంది, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. వయసు మళ్లిన తర్వాత సమయం ఉన్నా.. శరీరం సహకరించకపోవచ్చు. అందువల్ల శక్తి ఉన్నప్పుడు దివ్యక్షేత్రాలను దర్శించి పుణ్యం సంపాదించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

Pilgrimage: పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Pilgrimage Importance

Updated on: Mar 13, 2026 | 3:27 PM

Temple Pilgrimage Benefits: హిందూ ధర్మంలో పూజలు, వ్రతాలు ఎంత ముఖ్యమో, పుణ్య తీర్థ యాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. తీర్థయాత్రలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. పురాణాలు చెబుతున్నట్లు అనేక మహనీయులు, ఋషులు, పురాణ పురుషులు తీర్థయాత్రల ద్వారా ముక్తిని పొందారు. కొందరు కుటుంబంతోపాటు అందరూ కలిసి వెళ్లి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అయితే, పెద్ద వయస్సువారే ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో తీర్థయాత్రలకు పెద్దలు, వృద్ధులు వెళ్లాలా? అనే సందేహం ఏర్పడుతోంది. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తీర్థయాత్రలు వయసు మళ్లిన వారే చేయాలా?

సాధారణంగా చాలా మంది క్షేత్ర దర్శనం వృద్ధాప్యంలో చేయాలి అని భావిస్తారు. కానీ, నిజానికి యౌవనంలోనే పుణ్యక్షేత్రాలను దర్శించడం మంచిది. ఎందుకంటే ఆ సమయంలో శరీరంలో శక్తి ఉంటుంది, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. వయసు మళ్లిన తర్వాత సమయం ఉన్నా.. శరీరం సహకరించకపోవచ్చు. అందువల్ల శక్తి ఉన్నప్పుడు దివ్యక్షేత్రాలను దర్శించి పుణ్యం సంపాదించుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

తీర్థయాత్రల అవసరం

దేవుడు ప్రతి చోటా ఉన్నప్పుడు అంత దూరం వెళ్లి క్షేత్ర దర్శనం చేయాల్సిన అవసరం ఏముంది? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. దేవుడు ఎక్కడైనా ఉన్నాడనే విషయం నిజమే. అయితే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకమైన స్థల మహాత్మ్యం ఉంటుంది. దేవతలు, ఋషులు, మహనీయుల పాదస్పర్శతో ఆ ప్రదేశాలు పవిత్రమై ఉంటాయి. అక్కడి నదులు, నీటికి కూడా ఔషధ గుణాలు ఉన్నాయని విశ్వసిస్తారు. అందుకే భారతీయ సంస్కృతిలో పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక స్థానం ఉంది.

పురాణాల్లో తీర్థయాత్రలు

మహాభారతంలో వనవాస సమయంలో పాండవులు శ్రీకృష్ణుని ఆదేశంతో అనేక పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు పేర్కొనబడింది. అలాగే పరశురాముడు, మరెందరో మహర్షులు తీర్థయాత్రలు చేసి ముక్తిని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు కూడా రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా దోషం నివారణ కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శివపురాణంలో సాక్షాత్తు పరమశివుడు కూడా బ్రహ్మశిరస్సు ఖండించిన పాపం పోగొట్టుకోవడానికి బ్రహ్మకపాలాన్ని ధరించి అనేక తీర్థయాత్రలు చేసినట్లు వివరించబడింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు బలరాముడు కూడా తీర్థయాత్రలు చేసినట్లు పేర్కొన్నారు.

చరిత్ర ఉదాహరణలు

రామాయణంలో శ్రవణ కుమారుడు తన అంధ తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీర్థయాత్రలు చేయించిన కథ అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని చారిత్రక గ్రంథాలలో సిద్ధుడు అనేక తీర్థయాత్రలు చేసి కేదారేశ్వరుడు, హింగులాంబిక దేవిని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇలా మన పురాణాలు, ఇతిహాసాలు తీర్థయాత్రల ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తాయి.

తీర్థయాత్రలు చేస్తే ఏమవుతుంది..?

తీర్థయాత్రలు కేవలం పుణ్యం సంపాదించడానికి మాత్రమే కాదు, పురుషార్థాన్ని కూడా కలిగిస్తాయి. యాత్రల ద్వారా వివిధ ప్రాంతాల సంస్కృతి, ప్రజల జీవన విధానం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఇతర యాత్రికులతో కలిసిమెలిసి ఉండటం ద్వారా సామాజిక సంబంధాలు కూడా మెరుగుపడతాయి. ఈ అనుభవాల సమాహారాన్నే పురుషార్థం అంటారు.

పుణ్యక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించడం మాత్రమే కాకుండా, వాటి మహత్యాన్ని చదవడం, వినడం, ఇతరులకు వివరించడం కూడా మోక్షానికి దారి చూపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దర్శించదగిన పుణ్యక్షేత్రాలు

మన దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచారామాలు, త్రిలింగ క్షేత్రాలు, చార్‌‌‌‌ధామ్, పంచభూత క్షేత్రాలు వంటి అనేక పవిత్ర స్థలాలు తీర్థయాత్రలకు ప్రసిద్ధి. ముఖ్యంగా హిందువుగా జన్మించిన ప్రతి ఒక్కరూ సప్త మోక్షధామాలుగా ప్రసిద్ధి చెందిన అయోధ్య, మథుర, కంచి, మాయ, అవంతి, కాశీ, ద్వారకాలను తప్పకుండా దర్శించాలని చెబుతారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us