
ఒడిశా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం చుట్టూ చరిత్ర కలిగిన అనేక ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది బేడీ హనుమాన్ ఆలయం. బేడీ హనుమాన్ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఆలయంలో హనుమంతుడు బంగారు గొలుసుతో బంధించబడి దర్శనమిస్తాడు. అందుకే ఆలయాన్ని బేడీ హనుమాన్ టెంపుల్ అంటారు. ఎక్కడా లేని విధంగా బంగారు గొలుసుతో బంధింపబడిన హనుమంతుడిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తుంటారు.
గొలుసులతో బంధించబడి ఉండటం వల్లే బేడీ హనుమాన్ అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. అయితే, దీనికి ఒక చరిత్ర ఉంది. పురాతన కాలంలో సముద్రపు అలలు జగన్నాథ ఆలయంలోకి మూడు సార్లు ప్రవేశించేవని చెబుతారు. దీని కారణంగా జగన్నాథుడు వాయు కుమారుడైన హనమంతుడిని ఇక్కడి సముద్రాన్ని నియంత్రించేందుకు నియమించాడు. కానీ, హనుమంతుడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను చూసేందుకు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు.. సముద్రం కూడా అతని తర్వాత నగరంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. ఇది చూసిన జగన్నాతుడు.. సముద్రపు అలలను నిరోధించడానికి హనుమంతుడిని బంగారు గొలుసులతో బంధించాడు. అందుకే ఈ ఆలయాన్ని బేడి హనుమాను ఆలయం అంటారు.
బేడి హనుమాన్ ఆలయం విశిష్టత
తూర్పు ముఖంగా ఉన్న హనుమాన్ ఆలయ నిర్మాణం చాలా సరళంగా, అందంగా ఉంటుంది. ఆలయ ప్రధాన దేవత హనుమంతుడు కుడి చేతిలో గదను, ఎడమ చేతిలో లడ్డును పట్టుకుని ఉంటాడు. ఆలయ బయటి గోడలపై వివిధ దేవుళ్ల చిత్రాలు ఉన్నాయి. దక్షిణ గోడపై గణేశుడి విగ్రహం ఉంది. పశ్చిమ గోడపై హనుమంతుడి తల్లి అంచనాదేవి విగ్రహం ఉంది. ఆమె ఒడిలో బాల హనుమంతుడు ఉండగా.. ఉత్తర గోడపై అనేక దేవుళ్లు, దేవతల చిత్రాలు ఉన్నాయి. పూరీ వెళ్లినప్పుడు మీరూ ఈ ప్రత్యేక ఆలయాన్ని దర్శించుకోవడం మరిచిపోకండి.