
2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ప్రపంచమంతా జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరానికి సిద్ధమవుతుంటే.. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వేద పంచాంగం ఆధారంగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. 2026లో హిందూ నూతన సంవత్సరం ఎప్పుడు ప్రారంభం కానుంది..? ఆ రోజు ప్రత్యేకతలేంటి? అనే ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..
హిందూ పంచాంగం ప్రకారం.. చైత్ర మాసపు శుక్ల పక్ష పాడ్యమి నాడు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. 2026లో ఈ పర్వదినం మార్చి 19, గురువారం నాడు వస్తుంది. ఈ రోజుతోనే హిందూ క్యాలెండర్ విక్రమ సంవత్ 2083 ప్రారంభమవుతుంది. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం.. ఈ ఏడాదిని పరాభవ నామ సంవత్సరంగా పిలుస్తారు.
ఈ ఏడాది నూతన సంవత్సరం గురువారం ప్రారంభం కావడం అత్యంత శుభప్రదంగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
రాజు – బృహస్పతి: సంవత్సరానికి అధిపతి గురువు కావడం వల్ల విద్య, మతం, సమాజంలో సానుకూల మార్పులు వస్తాయి.
మంత్రి – కుజుడు: కుజుడు మంత్రిగా ఉండటం వల్ల వాణిజ్యం, ధైర్యసాహసాలతో కూడిన పనులకు అనుకూలంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక – సాంస్కృతిక ప్రాముఖ్యత
చైత్ర శుక్ల ప్రతిపాద కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, సృష్టి పునరుద్ధరణకు ప్రతీక. బ్రహ్మ దేవుడు ఇదే రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి.
వసంత నవరాత్రులు: ఇదే రోజు నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి ఆరాధన జరుగుతుంది.
వివిధ పేర్లు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో దీనిని ఉగాదిగా, మహారాష్ట్రలో గుడి పడ్వాగా, సింధీలు చేతి చంద్‌గా వైభవంగా జరుపుకుంటారు.
అభ్యంగన స్నానం: బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించాలి.
పూజలు: ఇష్టదైవానికి ప్రార్థనలు చేసి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏడాది పొడవునా గ్రహ దోషాలు తొలగిపోతాయి.
దానధర్మాలు: పేదలకు ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది.
సానుకూలత: ఇంట్లో మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టి మంగళకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలి.
తామస ఆహారం: ఈ పవిత్రమైన రోజున మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి.
వివాదాలు: ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు, గొడవలకు దిగకూడదు.
అపరిశుభ్రత: ఇంటిని లేదా మనస్సును అపరిశుభ్రంగా ఉంచకూడదు. మొదటి రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, ఏడాది మొత్తం అలాగే ఉంటుందని నమ్మకం.