
హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి నెల త్రయోదశి తిథినాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష వ్రతం రోజున ప్రదోష కాల సమయంలో సాయంత్రం శివపార్వతులను పూజిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న మాఘ మాసం శుక్ల త్రయోదశినాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. 2026 జనవరిలో చివరి ప్రదోష వ్రతం జనవరి 30న శుక్రవారం వచ్చింది. అందుకే దీనిని శుక్ర ప్రదోషం అని పిలుస్తారు. శుక్రవారం కావడంతో శివుడితోపాటు లక్ష్మీదేవిని కూడా పూచిస్తారు. దీంతో శివుడితోపాటు లక్ష్మీ దేవి ఆశీస్సులు లభించి సిరిసంపదలు పొందుతారు.
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు పండితులు.. సూర్యాస్తమయం తర్వాత మూడు గడియల తర్వాత రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారతుంది. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థం. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేదే ప్రదోషము. చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయం అయితే.. ఇప్పుడు ప్రదోషము అంటారు. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయంనకు తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశం ఉంది. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహా ప్రదోషం అని అంటారు.
ద్రిక్ పంచాంగం ప్రకారం.. జనవరి 30వ తేదీ శుక్రవారం నాడు శుక్లపక్ష ద్వాదశ తిథి ఉదయం 11.09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ తేదీ ప్రదోష ఉపవాసానికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రవారంనాడు చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. నక్షత్రం ఆర్ధ్రంగా ఉంటుంది. ఇది జనవరి 31వ తేదీ తెల్లవారుజామున 3.27 గంటల వరకు ఉంటుంది.
శుక్రవారం ప్రదోష ఉపవాసం అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. శివుడు, పార్వతీదేవి ఆశీస్సులు పొందడానికి దీనిని ఆచరిస్తారు. ప్రదోష సమయంలో శివలింగానికి పాలు, బిల్ల పత్రాలు, విభూదిని సమర్పిస్తారు. శివుడికి సంబంధించిన స్తోత్రాలు, శ్లోకాలు పఠించాలి. ఉపవాసం పాటించేవారు రోజంతా శివనామస్మరణతో గడుపుతారు. సాయంత్రం ప్రదోష కాలంలో ప్రత్యేక పూజలు చేస్తారు. శుక్రవారం కావడంతో ఈ ఉపవాసం శుక్రుని దుష్ప్రభావాలను తొలగించేందుకు, వైవామిక ఆనందం, శ్రేయస్సు కోసం ప్రయోజనకరంగా ఉంటుంది.
శుక్రవారంనాడు శివపార్వతులతోపాటు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం సిరిసంపదలను తెచ్చిపెడుతుంది. ప్రదోష వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతాయి. వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు కలుగుతాయి. సంతానం కోరుకునేవారికి సంతాన సాఫల్యం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)