Vastu Tips For New Home
వాస్తు శాస్త్రానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకోవడం వల్ల జీవితంలో సంతోషం, అదృష్టం కలుగుతాయి. అంతేకాదు వంశాభివృద్ధి జరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో మధురానుభూతి నెలకొంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వాస్తు నియమాలను విస్మరించడం ఇంటి యజమానిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మొదలు పెట్టిన పనులన్నీ ఆగిపోవడం , లేదా పనులు జరిగే సమయంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయి. వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇంట్లో ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి.
కనుక భూమి, ఇల్లు కొనుగోలు చేసే సముయంలో లేదా కొత్త ఇల్లు మారుతున్న సమయంలో ఖచ్చితంగా వాస్తును అనుసరించండి. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కూడా వాస్తు శాస్త్రం ప్రకారం వస్తువులను ఉంచాలి. కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే.. ఖచ్చితంగా ఈ వాస్తు నియమాలను పాటించండి. వాస్తుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..
కొత్త ఇల్లు కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
- ఇల్లు కొనేటప్పుడు ప్రకృతి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎల్లప్పుడూ సూర్యరశ్మి ఇంట్లోకి వచ్చే విధంగా ఉండాలి. అంతేకాదు స్వచ్ఛమైన, సహజమైన గాలి లభించే ప్రదేశంలో ఇల్లు కొనుగోలు చేయాలి. స్వచ్చమైన గాలి, సూర్యకాంతి లేని ప్రదేశంలో ఇల్లు కొనకూడదు.
- వాస్తు శాస్త్రం ప్రకారం కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు. అంతేకాదు దేవుళ్ళు కూడా ఈ దిశలో నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు ఇల్లు ఉత్తర దిశలో ఉండాలని, పూజ గది ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. లేదా ఈశాన్య దిశలో పూజ గది ఉండటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మరే ఇతర దిశలో పూజ గది ఉంటే ఆ ఇంటిని కొనకూడదు.
- ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, టాయిలెట్ దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వాస్తు ప్రకారం పశ్చిమ దిశలో మరుగుదొడ్డి ఉండటం శుభప్రదం. మరేదైనా దిశలో మరుగుదొడ్డి ఉంటే అక్కడ వాస్తు దోషం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో కొత్త ఇంటిని కొనుగోలు చేసే ముందు టాయిలెట్ దిశను తప్పని సరిగా దృష్టి పెట్టండి.
- అన్నపూర్ణ దేవి ఆహారానికి అధిదేవత. వంటగది ప్రధాన దేవతగా పరిగణించబడుతుంది. అందువల్ల ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు వంటగదిపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాస్తు ప్రకారం ఆగ్నేయంలో వంటగది ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వేరే దిక్కులో వంటగది ఉంటే ఆ ఇల్లు కొనకూడదు.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు, ట్యాంక్, కుళాయి ఉండకూడదు. అలాంటి ప్రదేశాలలో ఇల్లు కొనడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడమే కాదు.. ఆ ఇంట్లో నివసించడం అశుభం.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.