Sambhal: ఇకపై తీర్థ యాత్ర స్థలంగా సంభాల్.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం..!

| Edited By: Balaraju Goud

Dec 25, 2024 | 9:10 AM

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో రోజుకో వింత.. రోజుకో విశేషం కనిపిస్తున్నాయి. ఎక్కడ తవ్వితే అక్కడ చరిత్ర వెలుగుచూస్తోంది. సంభల్‌ జిల్లా చందౌసీ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో పాత మెట్లబావి బయటపడింది. ఇది రాజా రాణి సురేంద్రవాలా ఎస్టేట్‌గా చెబుతున్నారు. తవ్వకాలను కొనసాగిస్తామని, సంభల్‌ గర్భంలో దాగి ఉన్న నిజాలను వెలికితీస్తామని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ప్రకటించారు.

Sambhal: ఇకపై తీర్థ యాత్ర స్థలంగా సంభాల్.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం..!
Cm Yogi On Sambhal
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతోపాటు మెట్ల బావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగి సర్కారు సంభాల్‌ను తీర్థ యాత్ర స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. పాలరాతి నిర్మాణాలు సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే సందర్భంగా జరిగిన హింసాకాండ తర్వాత పాలనా యంత్రాంగం ఇక్కడ ఒక పురాతన శివాలయాన్ని గుర్తించింది. దానిని 1978లో మూసి వేశారని తేలింది. తాజాగా చందౌసీలో రెవెన్యూశాఖ తవ్వకాలు జరిపినప్పుడు ఒక భారీ మెట్ల బావి బయటపడింది. దీంతో శివాలయ పునః నిర్మాణానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర సర్కార్.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఈ సైట్‌లో తిరిగి సర్వే నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఈ ప్రాంతం గతంలో చెరువుగా రిజిస్టర్ అయ్యిందన్నారు. ఇక్కడ జరిపిన తవ్వకాల్లో ఒక సొరంగంతోపాటు మెట్ల బావి బయటపడిందని, ఒక అంతస్తు ఇటుకలతో, రెండవ, మూడవ అంతస్తులు పాలరాతితో నిర్మించినట్లు స్పష్టమయ్యిందన్నారు.

దాదాపు నాలుగు శతాబ్దాల ఆలయం. నిత్యం పూజలు అందుకున్న మహదేవుడి కోవెల. కానీ నాలుగు దశాబ్దాల కిందట మూతపడింది. అసలక్కడ ఆలయం ఉందన్నది కూడా ఆప్రాంతవాసులకు తెలియదు. గుడితో పాటు అక్కడున్న బావి పూడుకుపోయింది. బావి పక్కనుండే చెట్టూ మాయమైంది. ఆప్లేసులో అక్రమ కట్టడాలు మొలకెత్తాయి. కానీ ఇప్పుడా గుడి తలుపులు తెరుచుకున్నాయి. మట్టిలో పూడుకుపోయిన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని అధికారులు తెరిచారు. ఈ ఆలయ ఆక్రమణలపై సమాచారం అందుకున్న పరిపాలన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు ఈ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి కూడా ఉన్నట్లు పరిశోధనకారులు గుర్తించారు. ఆ ప్రాచీన ఆలయంలో బయటపడ్డ బావిలో తవ్వకాలు జరపడంతో….పార్వతీ దేవి, గణేష్‌, కార్తికేయుల విగ్రహాలు బయటపడ్డాయి.

అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు

బిలారి రాజుల పూర్వీకుల కాలంలో ఈ మెట్ల బావి నిర్మితమయ్యిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు పురాతన నిర్మాణానికి ఎటువంటి నష్టం జరగకుండా మట్టిని నెమ్మదిగా తొలగిస్తున్నారు. మరోవైపు ఈ
మెట్ల బావిని 1857లో నిర్మించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండు జేసీబీల సాయంతో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలతో తవ్వకాలు చేపడుతున్నారు.

మెట్ల బావి అంటే ఏమిటి?

మెట్ల బావి అనేది పురాతన భారతదేశంలో నీటిని సంరక్షించడానికి, నిల్వ చేయడానికి నిర్మించిన సాంప్రదాయ నీటి నిర్మాణం. మెట్ల ద్వారా బావిలోకి చేరుకుని నీటిని తోడుకోవచ్చు. భారతీయ వాస్తుశిల్పం, నీటి నిర్వహణ వ్యవస్థకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటిని ఆదా చేయడానికి మెట్ల బావులను నిర్మించేవారు. ఇది నీటి నిల్వ స్థలం మాత్రమే కాకుండా సామాజిక మతపరమైన కేంద్రంగా కూడా ఉండేది. మెట్ల బావి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. కాలక్రమేణా మెట్ల బావుల వాడకం తగ్గింది. అయితే నేడు ఇది చారిత్రక వారసత్వ సంపదగా, పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

తీర్థ యాత్ర స్థలంగా సంభాల్‌

సంభాల్‌కు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థ యాత్ర స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించనున్నారు. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి. పూర్వకాలంలో చెరువు లేదా సరస్సును పుణ్యక్షేత్రంగా పరిగణించే వారు. సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతుంటారు.

పాత ఫైళ్ల వెలికితీత

సంభాల్‌కు నలుమూలల్లో ఉన్న స్మశాన వాటికలు కూడా ‍ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదేవిధంగా సంభాల్‌లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి యూపీ సర్కారు ముందుకొచ్చింది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది. ఇప్పుడు దానిపై మరో వర్గంవారి ఆధిపత్యం కొసనాగుతున్నదని స్థానికులు అంటున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో యూపీ సర్కారు ప్రభుత్వ న్యాయవాదుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ‍ప్రభుత్వం వారికి సూచించింది.