
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం భక్తిశ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. ఇది అసాధారణ పాదయాత్ర భక్తి, నమ్మకం, ఆరాధన కలిసిన మహా యాత్ర. కొంతమంది భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే, మరికొందరు కాళ్లకు ఎనిమిది అడుగుల కర్రలు కట్టుకుని కష్టసాధ్యమైన యాత్ర చేస్తున్నారు. ఇంకొందరు స్వామివారి పల్లకిని మోస్తూ,మరికొందరు రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

కన్నడిగులు భ్రమరాంబ దేవిని తమ ఇంటి ఆడపడుచుగా,మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావిస్తారు.అందుకే ప్రతి సంవత్సరం ఉగాది సమయానికి లక్షలాది మంది కన్నడ భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా చేరుకుంటారు.కొంతమంది భక్తులు అయితే సుమారు నెల రోజులపాటు పాదయాత్ర చేస్తూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు.

40 డిగ్రీలకు పైగా ఎండ మండుతున్నాపిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆడ మగ తేడా లేకుండా ఆ మల్లన్న నామస్మరణతో ముందుకు సాగుతుంటారు.కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరంఅలసిపోయినా, భక్తి ముందు అవన్నీ లెక్క కాదు. నమశ్శివాయ మంత్రం జపిస్తూ మల్లన్న స్మరణలో మునిగిపోయి,శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు.

కర్ణాటక నుంచి బయలుదేరిన ఈ పాద యాత్రికులు కర్నూలు, ఆత్మకూరు, వెంకటాపురం, నాగలూటి, పెచ్చేరు, దామర్లకుంట, భీమునికల్ మార్గాల మీదుగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్నారు.

ఈ భక్తులకు దారి పొడవునా దాతలు అన్నదానం, మజ్జిగ, పండ్లు, త్రాగునీరు వంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భక్తి అంటే ఏమిటోఆరాధన అంటే ఏమిటోశివుడిపై ఉన్న విశ్వాసం ఎంత గొప్పదోఈ పాదయాత్రికులను చూస్తే అర్థమవుతుంది.